పర్యాటకుల మదిదోచుకుంటున్న వంజంగి ప్రకృతి అందాలు

పర్యాటకుల మదిదోచుకుంటున్న వంజంగి ప్రకృతి అందాలు

విశాఖ మన్యం అనగానే.. ప్రకృతి అందాల సోయగాలతో.. అలరారే... అరకు, లంబసింగి పర్యాటకుల కళ్లముందు కదులుతాయి. కానీ వాటిని తలదన్నే.. మంచు మేఘాల కొండ అందాలు ప్రకృతి ప్రేమకుల మదిదోచుతున్నాయి. ఇప్పుడా అందాలన్నీ.. విశాఖ జిల్లా పాడేరు మండలం వంజంగి గ్రామంలో కొలువుదీరి ఉన్నాయి.

వంజంగి గ్రామం.. సముద్ర మట్టానికి 3 వేల 4 వందల అడుగుల ఎత్తులో ఉంది. పాడేరు డివిజన్ కేంద్రం నుంచి 6 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గం ఉంది. అన్ని రకాల వాహనాల్లో అక్కడికి వెళ్లొచ్చు. అక్కడి నుంచి సుమారు గంట కాలి నడకన వెళితే.. మంచు మేఘాల కొండ అందాలు ఆస్వాదించవచ్చు. మరీ ముఖ్యంగా సూర్యుడి ఉషోదయపు కిరణాలు మేఘాలు చీల్చుకుంటూ వచ్చే దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం.

మనసు పులకరించే ఆ ఉషోదయపు అందాలను ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు. టెంట్లు, గుడారాలు వేసుకుని... సూర్యోదయ కిరణాల తేజస్సును చూడటానికి రాత్రి నుంచి కొండపై ఎదురుచూస్తుంటారు. పర్యాటకంగా కొండవరకు రహదారి నిర్మాణం జరిపితే.. ప్రభుత్వానికి ఆదాయంతోపాటు.. రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లే అవకాశం ఉందని ఇక్కడి వచ్చే పర్యాటకులు అంటున్నారు.

వంజంగి సమీపంలోని కొండలు.. పాల సముద్రాన్ని తలపిస్తుంటాయి. ఓ వైపు టూరిస్ట్ సీజన్‌ కూడా స్టార్ట్ అవడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గత కొద్ది రోజులుగా వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో.. భారీగా పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో ఒక్క రోజులో.. 10 నుంచి 12 వేల మంది పర్యాటకులు... మంచు మేఘాల కొండను సోయగాలను అస్వాదించారని అంచనా.

Tags

Read MoreRead Less
Next Story