ఇవాళ్టి నుంచి తిరిగి జనసేనాని వారాహి యాత్ర

ఇవాళ్టి నుంచి తిరిగి జనసేనాని వారాహి యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకోనున్నారు. భీమిలి ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతానికి వెళ్లనున్నారు. ఎర్రమట్టి దిబ్బలలో సహజసిద్ధ అందాలను ప్రభుత్వం నాశనం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. రెండున్నర చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో వ్యాపించి ఉన్న అద్భుత అరుణవర్ణ శిఖరాలు ఎర్రమట్టి దిబ్బలు. మన వారసత్వ సహజసంపదకు నిలయాలు. భౌగోళిక వారసత్వ సంపదకు పెట్టింది పేరైన విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలకు వైసీపీ ప్రభుత్వంలో ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎర్రమట్డి దిబ్బలకు ఆనుకుని జరిపిన భూ సేకరణపై వివాదం నెలకొంది. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ జోన్ కిందకు వచ్చే భాగంలో.. జీడిమామిడి తోటలు, తాటిచెట్ల విధ్వంసం కొనసాగింది. ప్రభుత్వం చర్యలపై విశాఖవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. VMRDA మాస్టర్ ప్లాన్‌లో ఎర్రమట్టి దిబ్బలను ప్రత్యేకంగా గుర్తించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. దీని పరిరక్షణకు చిత్తశుద్దితో అధికారులు వ్యవహరించాలని.. అన్నింటికన్న ముందు ఎర్రమట్టి దిబ్బలు వ్యాపించి ఉన్న ప్రదేశానికి సరిహద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేస్తోంది. హెరిటేజ్ టూరిజం కింద ఈ ప్రదేశాన్ని మరింత ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని.. లేదంటే వేల ఏళ్లుగా చెక్కుచెదరకుండా నిలిచివున్న సాక్ష్యాలు కనుమరుగయ్యే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com