Varra Ravindar Reddy: వర్రా రవీందర్‌రెడ్డిని కడప తీసుకొచ్చిన పోలీసులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపలోని సీకే దిన్నె పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సీకే దిన్నె పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరికాసేపట్లో ఆయనను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతను దూషిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్టు రవీందర్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పులివెందుల వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అనంతరం మరో కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో శుక్రవారం ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చినా పోలీసులు నిర్ధారించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే, ఎక్కడ, ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియరాలేదు. కాగా, రవీందర్‌రెడ్డిపై పులివెందుల, కడప, రాజంపేట, మంగళగిరితోపాటు హైదరాబాద్‌లో దాదాపు 30 కేసులు నమోదయ్యాయి. దళితుడిని దూషించాడన్న ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రవీందర్‌రెడ్డిపై నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com