ఏపీలో విచిత్ర పరిస్థితి.. గత 30ఏళ్లుగా ఆ పంచాయతీకి లేని సర్పంచ్

ఏపీలో విచిత్ర పరిస్థితి.. గత 30ఏళ్లుగా ఆ పంచాయతీకి లేని సర్పంచ్
500 మంది జనాభా ఉన్న ఈ పంచాయతీలో ఏకగ్రీవం జరుగుతోంది.

గత 30ఏళ్లుగా ఆ పంచాయతీకి సర్పంచ్ లేడు. ఆరు వార్డులున్న ఆ పంచాయతీలో.. మూడు వార్డులకు అసల అభ్యర్థులే లేరు. ఉప సర్పంచే ఆ పంచాయతీకి సర్పంచ్ హోదాలో పనిచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలోని వెంకటరెడ్డి పేట పంచాయతీలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది.

ఎటపాక షెడ్యూల్-5లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో.. రిజర్వేషన్లు అంటే ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు కేటాయించారు. ఎస్టీలకు కేటాయించిన ఈ పంచాయతీలో ఒక్క గిరిజనడూ లేడు. అయితే రిజర్వేషన్ మార్చాలంటే రాజ్యాంగ బద్ధంగానే నిర్ణయం తీసుకోవాలని.. అప్పటివరకు సర్పంచ్ పదవి ఖాళీగా ఉండాల్సిందే అంటోంది జిల్లా యంత్రాంగం.

ఇక్కడ సర్పంచి పీఠం ఖాళీగా ఉంటూ.. మిగిలిన వార్డు స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఆరు వార్డుల్లో 295 మంది ఓటర్లున్న ఈ పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు లేరు. బీసీ, ఇతరులు ఉన్నారు. 500 మంది జనాభా ఉన్న ఈ పంచాయతీలో ఏకగ్రీవం జరుగుతోంది. ఒక్కొక్కసారి ఎన్నికల ద్వారా ఒకే కుటుంబానికి చెందినవారు అధికార పీఠం దక్కించుకుంటున్నారు. ఉప సర్పంచ్‌ని ఎన్నుకోవడం.. ఆయనే సర్పంచిగా పాలన సాగించడం ఇక్కడ రివాజుగా మారింది. నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా.. సర్పంచి పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్ మార్చే అవకాశం లేదని, వెంకటరెడ్డి పేట పంచాయతీ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.



Tags

Read MoreRead Less
Next Story