VENKAYYA: వెంకయ్యనాయుడుకు పద్మ విభూషణ్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నవతరం ప్రతినిధిగా మెరిసి, జాతీయ స్థాయిలో.. తెలుగువాళ్లకు పెద్ద దిక్కుగా నిలిచిన వెంకయ్య నాయుడును పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. కేంద్రమంత్రిగా, బీజేపీ అధ్యక్షుడిగా దేశ నలుమూలల్నీ చుట్టివచ్చిన బహుదూరపు బాటసారి వెంకయ్యనాయుడు. ఉపరాష్ట్రపతి పదవికే వన్నెతెచ్చిన ఈ మహా నేతకు ఇప్పుడు పద్మవిభూషణ్ దక్కడం అందరినీ గర్వపడేలా చేసింది. ఈ పురస్కారాన్ని నవభారత నిర్మాణ భాగస్వాములకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
1949 జులై 1న నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. ముప్పవరపు వెంకయ్యనాయుడు. బుచ్చిరెడ్డిపాలెం జడ్పీ హైస్కూల్‌లోపాఠశాల విద్య, నెల్లూరు VR కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో లా చేశారు. యుక్త వయసు నుంచే ఆరెస్సెస్, ఏబీవీపీలతో కలిసి పనిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థిసంఘం.. అధ్యక్షుడిగా గెలిచారు. జై ఆంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1974లో జయప్రకాశ్ నారాయణ్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కన్వీనర్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైలుకూ వెళ్లారు. 1998 నుంచి 2017లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగానే ఉండే వెంకయ్య.... స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు.
తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి స్వయం కృషితో హిందీ, ఆంగ్లంలో అనర్ఘళంగా ప్రసంగించే ప్రావీణ్యం గడించారు. మూడు భాషల్లోనూ హాస్యాన్ని రంగరించి ప్రసంగించడం ఆయనకు అంత్యప్రాసలతో పెట్టిన విద్య. దక్షిణాది నుంచి రాజకీయం అరంగేట్రం చేసినా ఉత్తరాది నాయకులతో సమానంగా దేశరాజధానిలో గుర్తింపుపొందిన..... తెలుగు తేజం! ఎంత ఎత్తుకు ఎదిగినా గ్రామీణ వేష, భాషలను వీడని వ్యక్తిత్వం. మాటల్లో సరళత, చేతల్లో సౌమ్యత ఆయన విశిష్టత. సుదీర్ఘ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప ఎవ్వరితో వ్యక్తిగత విభేదాలు లేని అజాతశత్రువు. ప్రతిపక్షాల నుంచీ గౌరవం పొందిన కొద్ది మంది నాయకుల్లో వెంకయ్య కూడా ఒకరు. ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించిన ఆయన పెద్దల సభకు సమయపాలన నేర్పారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో ఆర్టికల్ 370 బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనా.,,.ఒక్కర్నీ సభ నుంచి బయటికి పంపకుండా, ఒక్క నిమిషం కూడా సభను వాయిదా వేయకుండా,..... అత్యంత చాకచక్యంగా సభను నిర్వహించి, సున్నితంగా ఆ బిల్లును పాస్ చేయించిన సాధకుడు. భారతదేశం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రకటించిన పద్మవిభూషణ్‌ను వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు వెంకయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ..... ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com