VICE PRESIDENT: మరోసారి ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్కడ్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈలోగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది రెండో మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ తరఫున అభ్యర్థిని ఖరారు చేయడానికి రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఇవాళ సాయంత్రం 6 గంటలకు కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా పాల్గొని అభ్యర్థిని నిర్ణయించనున్నారు. ఈ సమావేశం కూటమి భాగస్వాముల నుండి ఏకాభిప్రాయంతో ఓ అభ్యర్థి ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు అంచనా వ్యక్తమవుతోంది.
ఇప్పటికే పూర్తయిన చర్చలు
బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు జెపీ నడ్డాతో కలిసి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే విస్తృత చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి, వాటిలో ఒకరిని ఫైనల్ చేయడానికి ఇవాళ సమావేశం నిర్వహించనున్నారు. ఈ అభ్యర్థుల రేసులో ముఖ్యంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, బిజెపి సీనియర్ సభ్యుడు శేషాద్రి చారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే.. ప్రస్తుత, మాజీ గవర్నర్లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఆగస్టు 21న కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ పత్రాల దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా, ఆగస్టు 20న NDA విందు జరిగే అవకాశం ఉందని, ఆ సమయంలో అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయంతో అధికారికంగా ప్రకటిస్తారని వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ విధానాలపై బిజెపి ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి సెప్టెంబర్ 6 నుంచి 9 మధ్య రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలను ఢిల్లీలో ఉండమని పార్టీ కోరింది.
వెంకయ్యకే అవకాశం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మరోసారి ఉపరాష్ట్రపతి పదవి వరించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో వెంకయ్యను నియమించాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఈ మేరకు ఎన్డీఏ పక్షాలతో చర్చించినట్టు సమాచారం అందుకోంది. ఈ విషయంపై వెంకయ్య అభిప్రాయం కూడా తీసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య కారణాలతో అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో ఖాళీ పోస్టులో ఎవర్ని నియమించాలనే చర్చ తీవ్రంగా సాగుతోంది. వచ్చే ఏడాది రెండు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నియామకం జరగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం అనూహ్యంగా వెంకయ్య పేరును తెరపైకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. వెంకయ్యనాయుడుకు రాజ్యాంగంపట్ల, రాజ్యసభ నిర్వహణ పట్ల పట్టు ఉంది. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్న ఐదు సంవత్సరాల కోసం భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సమస్యలు రాలేదు. అదే సమయంలో.. ఆయన పనితీరు అందరి ప్రశంసలు అందుకుంది. బీజేపీ వెంకయ్య పేరును పరిశీలించడానికి ఇది కూడా ఓ కారణం అన్న ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com