విజయవాడలో ఓ రెస్టారెంట్.. విజిట్ చేసిన అధికారులు షాక్

చికెన్ కబాబ్‌లు, మటన్ మంచూరియాలు.. సపరివార సమేతంగా హోటల్‌కి వెళితే ఏం ఆర్డర్ ఇవ్వాలో అర్థం కాదు మెనూ చూస్తే.. దాదాపు అన్నీ నోరూరిస్తుంటాయి. పక్క వారి ప్లేట్లో నుంచి ఘుమ ఘుమ వాసనలు.. ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది ఇంకెప్పుడు తెస్తావ్ అంటూ సర్వర్ మీద అరుపులు.. వెరసి కడుపు నిండా తిని ఆనక ఓ కిళ్లీ వేసుకుని బయటకి వస్తాం.. కానీ లోపల ఏం జరుగుతోందో తెలిస్తే తిన్నవన్నీ బయటకు వస్తాయేమో.. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మాంసం గడ్డకట్టిపోయి ఉంటుంది..
రాత్రి వండిన అన్నం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్‌లో తోసి మర్నాడు వేడివేడిగా కస్టమర్‌కి అందించడం షరా మామూలే.. ఇవే అంశాలు విజిలెన్స్ అధికారులు విజయవాడలోని బార్బిక్యూ రెస్టారెంట్ విజిట్ చేసినప్ఫుడు వెలుగు చూశాయి. ఇక్కడి ఎంజీరోడ్డులోని లైఫ్‌స్టైల్ భవనంలో ఉన్న రెస్టారెంట్‌ని విజిలెన్స్ శాఖ, ఆహార భద్రత అధికారులు సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి.
కుళ్లిపోయే స్థితిలో ఉన్న మటన్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, హానికర రసాయనాల వాడకం, అడుగడుగునా అధికారుల నిబంధనలను తుంగలో తొక్కి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సంపాదనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వినియోగ దారుల ఆకలిని వ్యాపారం చేసుకుంటూ లక్షలు ఆర్జిస్తున్నారు. విజిలెన్స్ ఎస్పీ కనకరాజ్ నేతృత్వంలో జరిగిన ఆకస్మిక దాడుల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అధికారులు ఫ్రిజ్‌తో పాటు, వంటగది, స్టోర్ రూంలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ కనకరాజ్, విజయవాడ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడారు. ప్రిజ్‌లో ఉంచిన మటన్ గడ్డకట్టుకుపోయింది.. ప్రజలకు హాని కలిగించే పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించామన్నారు. ప్రయోగశాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కోవిడ్ నిబంధనలు కొంచెం కూడా కనబడలేదు.. దీనిపై కూడా జేసీకి ఫిర్యాదు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో అధికారులు అశోక్ రెడ్డి, ఎం. వెంకటేశ్వరరావు, ఆహార తనిఖీ అధికారులు రమేష్ బాబు, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com