బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన ద్విచక్రవాహనాలు

విజయవాడలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పలు కొత్త బైక్‌లు కాలి బూడిదయ్యాయి. నగరంలోని కేపీ నగర్ ప్రాంతంలో ఉన్న కాసా టీవీఎస్ వాహన షోరూంలో మంటలు చెలరేగాయి. షోరూంతోపాటు గోడౌన్‌లోని వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు.
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న షోరూమ్ లో మంటలు చెలరేగాయి. విజయవాడ టీవీఎస్ వాహనాలకు కేంద్ర కార్యాలయం కావడంతో వందలాది వాహనాలను గోడౌన్ లోనే ఉంచారు. ఇదే ప్రాంతంలో ద్విచక్ర వాహనాల షోరూంలు, సర్వీస్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నారు. గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. గోడౌన్‌లో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సాధారణ ద్విచక్ర వాహనాలు కూడా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ప్రీఫ్యాబ్రికేటెడ్ షోరూమ్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం కోట్లలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఇతర కారణాలు మరేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. షోరూం మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com