AP: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ..

ముఖ్యమంత్రి జగన్‌పైకి ఎవరో ఆగంతకుడు రాయి విసరడం విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా దృష్టిలో హత్యాయత్నం. ఆ ఘటన తీవ్రత, పరిస్థితుల్నిబట్టి ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని విలేకర్లు ప్రశ్నిస్తే కాదు. రాయి విసరడం వల్లే దాడి జరిగిందని తేల్చిచెప్పారు. ప్రతిపక్షనేత రెండేళ్ల క్రితం చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన దర్యాప్తులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తన వైఖరిని స్పష్టంగా చాటిచెప్పారు.
సీఎం జగన్‌పై రాయిదాడి ఘటనను విజయవాడ సీపీ కాంతి రాణా... తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదే కాంతి రాణా... 2022 నవంబరు 4న మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నందిగామలో రాళ్ల దాడి జరిగినప్పుడూ సీపీగా ఉన్నారు. అప్పుడు మాత్రం ఆయన ఆ ఘటనను తేలిక చేసి మాట్లాడారు. వెంటనే కేసు కూడా నమోదు చేయలేదు. టీడీపీ నేతలు ఒత్తిడి పెంచడంతో అతి కష్టం మీద సెక్షన్ 324 కింద కేసు కట్టారు. ఇంత వరకు నిందితులెవరో గుర్తించలేదు. అసలా కేసు దర్యాప్తు జరుగుతుందో లేదో కూడా తెలీదు.
అప్పుడూ, ఇప్పుడూ సీపీ ఒక్కరే. జరిగింది ఒకే తరహా ఘటనలు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి మరొకరు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి. కానీ అప్పుడూ, ఇప్పుడూ సీపీ స్పందించిన తీరే ఆయన ఏకపక్ష వైఖరికి అద్దం పట్టింది. ఎంత అధికార పార్టీతో అంటకాగితే మాత్రం బాధ్యతాయుతమైన పోలీసు కమిషనర్ పోస్టులో ఉన్న అధికారి స్పందించేది ఇలాగేనా.. తన వైఫల్యాల్ని, పక్షపాతధోరణిని ప్రశ్నించిన మీడియా, విపక్షాలపై కాంతి రాణా ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశారే. తమపై నిరాధార, ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని గింజుకున్నారే. పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయడానికి అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని తెగ బాధపడిపోయారే. పోలీసు అధికారులు ఏ పార్టీకి కొమ్ముకాయకుండా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎవరైనా వారిని ఎందుకు తప్పుపడతారు. మీరు ఏ మాత్రం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదనడానికి... సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడి జరిగిన సందర్భాల్లో మీరు స్పందించిన తీరే అద్దంపడుతోంది కదా.
ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి జరిగిన ప్రాంతంలో దాదాపు 5 వేల మంది ప్రజలు ఉన్నారని... పైగా అంతా చీకటిగా ఉందని... అంత మందిలో నుంచి ఒక్క వ్యక్తిని పట్టుకోవడం అంత తేలిక కాదని... విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా చెప్పారు. అయినా నిందితుడిని వంద శాతం పట్టుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రోడ్‌షో సాగిన మార్గం మొత్తం భద్రతా లోపం తలెత్తకుండా 1,480 మంది పోలీసులను మోహరించామన్నారు. పర్యటన సాగిన దారంతా అత్యంత రద్దీ ప్రాంతాలే. సీసీ కెమెరా దృశ్యాలు, వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివేకానంద పాఠశాల, రామాలయం మధ్య ఖాళీగా ఉన్న ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తి రాయి బలంగా విసిరినట్లు గుర్తించామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com