దివ్య హత్య కేసు : ఆ వీడియోలో ఏముందంటే..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో వేగం పెరిగింది. దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 15 నుంచి నాగేంద్రబాబు జీజీహెచ్‌లో చికిత్స పొందాడు. నాగేంద్రబాబు కోలుకుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేసిన తర్వాత... .పోలీసులు విజయవాడకు తరలించారు. విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు. శనివారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ప్రాథమిక దర్యాప్తులోనే పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. నాగేంద్ర హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడా అని ఎదురు చూసిన పోలీసులు... కీలక విషయాలు రాబట్టే పనిలో నిమగ్నం అయ్యారు. ఇద్దరికి ప్రేమ వివాహం జరిగినట్టు ప్రాథమిక విచారణలో నాగేంద్ర వెల్లడించాడు. దివ్యను తాను హత్య చేయలేదని.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. తేజస్విని ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు. నాగేంద్రతో రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో కొనసాగానని, ఆ తర్వాత నాగేంద్రలోని సైకో గురించి తెలిసిందని... ఆ వీడియోలో దివ్య తెలిపింది.
లాక్‌డౌన్ సమయంలో దివ్య, నాగేంద్ర పెళ్లి చేసుకుని... 3 నెలలు కలిసి ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లిని... దివ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. దివ్యను ఇంటికి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు... 4నెలల పాటు ఇంట్లో నిర్బంధించారు. అక్టోబర్ 15న.. దివ్యను తీసుకెళ్లేందుకు నాగేంద్ర ప్రయత్నించగా... దివ్య తల్లిదండ్రులతో... వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో దివ్య ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న నాగేంద్ర... కత్తితో ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నాగేంద్రబాబుకు కూడా గాయాలయ్యాయి. చికిత్స కోసం అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 22 రోజుల పాటు చికిత్స పొంది... డిశ్చార్జ్ అయిన నాగేంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. లోతుగా ప్రశ్నించి.. నిజాలు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com