ARMY: బుడమేరు గండ్లు పూడ్చేందుకు నేడు రంగంలోకి ఆర్మీ
బుడమేరు వాగుకు పడిన గండ్లు పూడ్చేందుకు నేడు ఆర్మీ రంగంలోకి దిగనుంది. విజయవాడ పరిసరాల్లో గండ్లను పరిశీలించనున్న ఆర్మీ... ఆ తర్వాత వాటి పూడ్చివేతకు ప్రణాళికలు రచించనుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించేందుకు ఆర్మీ నిపుణులు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. బుడమేరు వాగు ఆధునికీకరణ కోసం పనులు ప్రారంభిస్తే 2019లో జగన్ రద్దు చేశారని అందుకే ఈ జల విలయం వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.
చంద్రబాబు ఆగ్రహం
బుడమేరు వాగు ఆధునికీకరణ కోసం పనులు ప్రారంభిస్తే.. 2019లో జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని చంద్రబాబు తెలిపారు. 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని మరింత పటిష్టపరచాలని వెల్లడించారు. కృష్ణా నదీ కరకట్టలను మరింత బలపరిచేలా చర్యలు తీసుకోవాలి. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు. ఇంతటి జల ప్రళయం సంభవించినా మృతులు సంఖ్యని తగ్గించగలిగామని చంద్రబాబు వెల్లడించారు. ఐఏఎస్ అధికారులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని అని అభినందించారు.. వరద సాయంపై బాధితులు సంతృప్తితో ఉన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు.
చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రహదారి మార్గంలో సీఎం.. విజయవాడ గ్రామీణ ప్రాంతమైన ఎనికేపాడు చేరుకున్నారు. అక్కడి నుంచి చిన్న మట్టిరోడ్డుపై ప్రయాణించి.. పొలాల్ని ముంచెత్తిన రైవస్ కాలువ, ఏలూరు కాలువల్ని పంటుపై దాటారు. అవతలి వైపునకు చేరుకొని బుడమేరు ముంపు ప్రాంతాన్ని, గండ్లను పరిశీలించారు. గండ్లు పూడ్చే పనులపై అధికారులతో పంటు మీదే సమీక్షించారు. మ్యాపుల్ని పరిశీలిస్తూ... బుడమేరు ప్రవాహ తీరు, ఎన్ని గండ్లు పడ్డాయి, వాటిని పూడ్చడానికి ఎంత సమయం పడుతుంది? శాశ్వత మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై పలు ప్రశ్నలు సంధించారు. వారికి పలు సూచనలు చేశారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వరద రాలేదని, సర్వం కోల్పోయామని చంద్రబాబు ముందు పలువురు రైతులు, మహిళలు, వృద్ధులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారికి ధైర్యం చెప్పిన సీఎం... ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com