విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా కసరత్తు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా కసరత్తు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఏడాదిన్నరలోగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా లక్షా 75 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం... దాన్ని సాకారం చేసుకొనేందుకు 'విశాఖ ఉక్కు' విక్రయ వ్యవహారాన్ని వేగంగా కదిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రైవేటీకరణను తొలుత కేంద్ర ప్రభుత్వం లావాదేవీల, న్యాయ సలహాదారులను నియమిస్తుంది. తర్వాత కొనేందుకు ఆసక్తి గలవారిని ఆహ్వానిస్తూ 'ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌' పిలుస్తారు. అర్హతలను ముందే నిర్దేశిస్తారు. అనుభవం, నెట్‌వర్త్‌, ఉక్కు తయారీ సామర్థ్యం, దేశీయ భాగస్వామ్యం లాంటి షరతులు పెడతారు. ఇందులో అర్హత సాధించిన వారికి 'రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌' బిడ్డింగ్‌కు అనుమతిస్తారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని కొనేందుకు ఆర్థిక బిడ్‌ దాఖలుకు ఆ తర్వాత వీలు కల్పిస్తారు. ఎక్కువ మొత్తం కోట్‌ చేసినవారికి కర్మాగారం అప్పగిస్తారు.

ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్నా.. స్పందన అంతగా రావట్లేదని వాదన వినిపిస్తోంది. గతేడాది ప్రైవేటీకరణ ద్వారా 2లక్షల 10వేల కోట్ల రూపాయలు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా.. కేవలం 30వేల కోట్ల రూపాయలే వచ్చాయి. గతేడాది అమ్మకానికి పెట్టిన సంస్థల లాభదాయకత సరిగా లేకపోవడంవల్లే కొనుగోలుదార్ల నుంచి పెద్దగా స్పందన రాలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. విశాఖ ఉక్కుకు మంచి డిమాండు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కర్మాగారం సముద్రతీరంలో ఉండటం, పక్కనున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఇనుప ఖనిజం అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపొచ్చని భావిస్తున్నారు.

అటు.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా సంఘాల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. విశాఖపట్నం మద్దిలపాలెం కూడలిలో జరిగిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం సీపీఐ, సీపీఎం, సహా మహిళా సంఘాల నేతలు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. మానవహారం, నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుత నిరసనను అడ్డుకోవడం ఏంటని ఆందోళనకారులు మండిపడ్డారు. పోలీసులు ఆందోళనకారుల్ని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెదగంట్యాడ కూడలిలో మహాధర్నా నిర్వహించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రైవేటీకరణకు బదులు సొంత గనులు కేటాయించడం, రుణభారం తగ్గించడం లాంటి సహాయక చర్యలు ప్రకటిస్తే.. కర్మాగారం మళ్లీ లాభదాయక పరిశ్రమగా మారుతుందని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. పరిశ్రమ ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story