విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పోస్కో ఒప్పందం జగన్ ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా?

విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పోస్కో ఒప్పందం జగన్ ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా?
విశాఖ స్టీల్‌ప్లాంట్ జీఎం రాసిన లేఖలో అసలు విషయం బయటపడింది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పోస్కో ఒప్పందం జగన్ ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా? స్టీల్‌ప్లాంట్‌ వ్యవహారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ... ఆ సంస్థలో ఏం జరుగుతోందో ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా? ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఒక్కటే. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ.. దాంతో రాష్ట్రానికేం సంబంధం లేదు అని చెబుతూ వచ్చింది. మరి పోస్కో ప్రతినిధులు వచ్చి కలిశారు కదా అని ప్రశ్నిస్తే.. వాళ్లొచ్చింది స్టీల్‌ప్లాంట్‌ కోసం కాదని చెప్పుకొచ్చారు. నిజానికి జరిగింది వేరు అని అర్థమవుతోంది. స్వయంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ జీఎం రాసిన లేఖలో అసలు విషయం బయటపడింది. అక్టోబర్‌ 23, 2019న పోస్కోతో ఎంఓయూ కుదిరినట్లు విశాఖ స్టీల్స్ జనరల్ మేనేజర్‌ లేబర్‌ కమిషనర్‌కు ఇచ్చిన లేఖలో చాలా స్పష్టంగా ఉంది. ఆ సమయంలో పోస్కో ప్రతినిధులు జగన్‌ను కూడా కలిశారు. కాని, అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదంటున్నారు కార్మికులు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పోస్కోకు మధ్య రెండేళ్ల క్రితమే ఒప్పందం జరిగింది. కేంద్రం ఆదేశాలతోనే ఇదంతా జరిగిందనేది వాస్తవమే. కాని, స్టీల్‌ప్లాంట్‌లో ఏం జరుగుతోందో ప్రభుత్వానికి తెలియకుండా ఎలా ఉంటుందన్నదే ప్రశ్న. కొరియాకు చెందిన అతిపెద్ద సంస్థ ప్రతినిధులు రాష్ట్రానికి వస్తున్నారంటేనే చాలా పెద్ద విషయం. ఏదో జరుగుతోందనే అర్థం. ఆ విషయం జగన్ ప్రభుత్వానికి తెలియదనడం అజ్ఞానమే అంటోంది విపక్షం. పోస్కో, విశాఖ ఉక్కు మధ్య అవగాహన ఒప్పందం జరగడం నిజంగా ఓ సెన్సేషనే. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వచ్చిన స్టీల్‌ప్లాంట్‌లోకి ఓ విదేశీ కంపెనీ దూరుతోందంటే.. ఆ విషయం జగన్ ప్రభుత్వానికి ఎలా తెలియకుండా ఉంటుంది. స్టీల్‌ప్లాంట్‌లో జరుగుతున్న విషయాలన్నీ జగన్ సర్కార్‌కు తెలుసనేది కార్మికుల వాదన. ఒప్పందాలు, మాటీమంతీ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం జోక్యం చేసుకోకపోవడమే విస్మయం కలిగిస్తోందని చెబుతున్నారు.

Tags

Next Story