Visakhapatnam Bride Death: విశాఖ వధువు మృతి కేసులో కొత్త కోణం.. ఇది సహజ మరణం కాదంటూ..

Visakhapatnam Bride Death: విశాఖలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. శివాజి-సృజనల వివాహం బుధవారం సాయంత్రం 7 గంటలకు జరగాల్సి ఉంది. బహిరంగ ప్రదేశంలో భారీ వేదిక ఏర్పాటు చేసి.. పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. ముహూర్త సమయానికి వరుడు శివాజీ, వధువు సృజన పెళ్లి పీటలెక్కారు. కాసేపట్లో మూడు ముళ్ల బంధంతో ఒకటై పోతున్నామనే ఆనందంలో ఉన్నారు. కానీ అంతలోనే అనుకోని ఘటన జరిగింది. జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో వధువు సృజన స్పృహ తప్పి పడిపోయింది.
ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ చివరికి సృజన ప్రాణాలు విడిచింది. వధువు సృజన పెళ్లి పీటలపైనే చనిపోవడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన కుటుంసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే.. ఆమెది ఆత్మహత్యా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సృజన మృతదేహాన్ని కేజీహెచ్ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు.
రెండ్రోజులుగా అస్వస్థతగా ఉండటంతో కుటుంబసభ్యులు.. ఆసుపత్రిలో చికిత్స చేయించి పెళ్లికి సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. సృజన మృతిలో మరో కోణం వెలుగులోకి వస్తోంది. ఆమె విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు పోలీసులు. గన్నేరు పప్పు తిన్నట్లు అనుమానిస్తున్నారు. ఆమె బ్యాగ్‌లో గన్నేరు పప్పును సైతం గుర్తించారు పోలీసులు.
పెళ్లి ఇష్టం లేదనే విషయాన్ని కొంతమంది ఆమె సన్నిహతుల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. భారీ వేదికను సైతం ఏర్పాటు చేశారు. పలువురు వీఐపీలు కూడా తరలివచ్చారు. అంతా ఆనందంగా జరుగాల్సిన ఈ వివాహ కార్యక్రమంలో సృజన మృతి తీవ్ర విషాదం నింపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com