VISHAKA: "అయోధ్య ఆలయం" సెట్టేసి.. భక్తులను దోచేశారు

విశాఖపట్నం బీచ్ రోడ్డులో అయోధ్య రామాలయం సెట్ వేసి భక్తి ముసుగులో మోసాలు చేస్తున్న వారి గుట్టు రట్టయింది. దర్శనాలు, కళ్యాణోత్సవాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నిర్వాహకులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం దేవస్థానం నుంచి పండితులు వస్తారంటూ కళ్యాణోత్సవం టికెట్లు భారీ రేట్లతో విక్రయించడంతో పోలీసులకు భద్రాచలం ఆలయ ఈఓ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కల్యాణోత్సవం పేరిట వసూళ్లు
అయోధ్య రామ మందిరం సెట్ వేసి భక్తులకు రాముని దర్శనం కల్పించారు. అంతవరకు బాగానే ఉంది. ఈ నెలాఖరుకు ఈ సెట్‌ను తొలగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అయో ధ్య రాముడి కల్యాణోత్సవానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. దీన్ని స్వయంగా భద్రాచలం దేవస్థానం పండితులచే నిర్వహించనున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం భక్తుల నుంచి రూ.2,999 చొప్పున వసూళ్లు చేస్తుండటమే ఆరోపణలకు తావిచ్చింది. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం పండితులు వచ్చి కల్యాణం క్రతువు నిర్వహిస్తారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తించారు. ఈ ప్రచారంపై భద్రాచలం ఆలయ అధికారులకు తెలిసి విచారణ నిర్వహించారు. అక్కడి నుంచి పండితులెవరూ విశాఖపట్నం రావడం లేదని తేలింది. కల్యాణోత్సవంపై కనీస సమాచారం కూడా ఇవ్వకుండా దేవాలయం పేరును దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తించిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్.రమాదేవి.. విశాఖపట్నం కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు, 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు, దేవదాయ శాఖ అధికారులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com