VISHKHA: గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ

ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం గ్లోబల్ డిజిటల్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగు వేసింది. నగరంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తాజాగా శంకుస్థాపన చేశారు. నాస్డాక్లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను సిఫీ అభివృద్ధి చేయనుంది. దీనిలో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుతో గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ మారనుంది. ఐటీ సొల్యూషన్స్ సంస్థ సిఫీ టెక్నాలజీస్, దాని అనుబంధ సంస్థ అయిన సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అత్యాధునిక డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. కేవలం డేటా సెంటరే కాకుండా, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం.
రూ.1500 కోట్ల పెట్టుబడి అభివృద్ధి
ఈ ప్రాజెక్టు కోసం సిఫీ సంస్థ రెండు దశల్లో సుమారు రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత, దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ నగరం అంతర్జాతీయంగా ఒక కీలకమైన డిజిటల్ గేట్వేగా మారనుందని, ఇది రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ద్వారా భారతదేశం, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ దేశాల మధ్య వేగవంతమైన డేటా కనెక్టివిటీ ఏర్పడనుంది. విశాఖను దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 5 లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ప్రభుత్వం విశాఖలో ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయంవల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ.. ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తుంది. భారతదేశంతోపాటు ఆగ్నేయాసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సీఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్‌గా పనిచేస్తుంది.
మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ
విశాఖపట్నంకు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.87,250 కోట్ల పెట్టుబడులతో 1,000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రెండున్నరేళ్లలో మొదటి దశ యూనిట్‌ను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందించింది. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. విశాఖపట్నం-అనకాపల్లి ప్రాంతంలోని తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలలో మూడు అతిపెద్ద డేటా సెంటర్లు రానున్నాయి. ఈ మూడు క్యాంపస్‌ల కోసం దాదాపు 500 ఎకరాల భూమిని గుర్తించారు. అక్టోబర్ 14న న్యూఢిల్లీలో ఈ ప్రాజెక్ట్ కోసం అధికారిక ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనుందని అంటున్నారు. అదానీ, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్, సిఫీతో పాటు టీసీఎస్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వస్తుండటంతో డేటా సెంటర్ల హబ్‌గా విశాఖ మారుతోంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ కేంద్రంగా అవతరిస్తోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్కు భూముల కేటాయింపునకు శుక్రవారం నాటి క్యాబినెట్ సమావేశం ఆమోదించింది. ఈనెల 14వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ సమక్షంలో రైడెన్ అధికారిక ప్రకటన చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com