Viveka Murder Case: సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది తెలంగాణ హైకోర్టు. సాక్షుల రక్షణ, పారదర్శక దర్యాప్తు దృష్ట్యా ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. సునీల్ యాదవ్ మరికొందరితో కలిసి వివేకాను హత్య చేశారని, హత్య అనంతరం పారిపోవటాన్ని వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న చూశారని సీబీఐ చెబుతోందని ఈ నేపథ్యంలో సహేతుక దర్యాప్తునకు వీలుగా నిందితుడికి బెయిల్ ఇవ్వలేమని తెలిపింది హైకోర్టు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం సాక్షిగా విచారణకు పిలిచినప్పటికీ తర్వాత నిందితుడిగా చేర్చొచ్చని వెల్లడించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం విచారణ నిమిత్తం ఎవరినైనా పిలిచే అధికారం పోలీసులకు ఉందని తెలిపింది. ఈ నోటీసు ప్రకారం విచారణకు హాజరైన సునీల్‌యాదవ్ కూడా దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారని తెలిపింది. ఆయన్ను సాక్షిగా పిలిచినప్పటికీ... నిందితుడిగా చేర్చొవచ్చని స్పష్టంగా తెలిపింది హైకోర్టు. ఈ కేసులో పారదర్శక, సహేతుక విచారణ కొనసాగాల్సి ఉండటం, దర్యాప్తు పెండింగ్‌లో ఉండటంతో ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
అంతకు ముందు సీబీఐ, సునీల్ యాదవ్, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. వివేకా హత్యకు కుట్ర సమయంలోనూ, హత్య తర్వాత జరిగిన సంఘటనల్లోనూ సునీల్‌యాదవ్‌ది కీలకపాత్ర అని పేర్కొంటూ సీబీఐ తరఫు ప్రత్యేక న్యాయవాది వినిపించిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com