Viveka Murder Case: మళ్లీ మొదటికే..

వివేకా హత్య కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో ఐదు సిట్‌లు ఏర్పాటుకాగా.. ఇప్పుడు ఆరో సిట్‌ను ఏర్పాటు చేసింది సీబీఐ. హత్య జరిగిన నాలుగేళ్ల తర్వాత కేసు దర్యాప్తు కోసం మళ్లీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత సంచలనం సృష్టించిన, అంతర్జాతీయ అంశాలతో ముడిపడిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసును ఒకే ఒక్క అధికారి నేతృత్వంలోని ‘సిట్ ఛేదించింది. కానీ వివేకా హత్య కేసులో మాత్రం ఇప్పటికి ఐదు సిట్‌లు వేసినా పురోగతి కనిపించ లేదు. ఇప్పుడు ఆరో దర్యాప్తు అధికారి కేశవరామ్ చౌరాసీయా నేతృత్వంలో ఏర్పాటైన సిట్ నిజాలను బయటికి తీస్తుందా? లేక ఇది కూడా మిగిలిన ఐదు సిట్‌లాగానే వ్యవహరిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
కడప జిల్లా పులివెందులలో 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి దాటాక వివేకా హత్య జరిగింది. తొలుత గుండెపోటు కథ అల్లినప్పటికీ తర్వాత ఆయనది హత్య అని నిర్ధారణ అయ్యింది. దీనిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నాటి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నేతృత్వంలో డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐలు సాధిక్ అలీ, హమీద్, శ్రీరామ్‌తో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్’ కీలక సమాచారం రాబట్టేలోపే ఎన్నికలు జరిగి, ప్రభుత్వం మారింది. దీంతో జగన్ సర్కారు జిల్లా ఎస్పీని బదిలీ చేసింది. కొత్తగా ఎస్పీ అభిషేక్ మహంతి నేతృత్వంలో డీఎస్పీ ఐ.రామకృష్ణతో కొత్త సిట్ ఏర్పాటు చేసింది. ఈ బృందం దర్యాప్తు చురుగ్గా కొనసాగుతూ కీలక నిర్ణయం’ తీసుకునేలోపే ఎస్పీ అభిషేక్ మహంతి సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత ఏకంగా తెలంగాణ కేడర్‌కు మారిపోయారు. అభిషేక్ మహంతి తర్వాత... ఈ కేసును కడప ఎస్పీగా వచ్చిన అన్బురాజన్ నేతృత్వంలో పులివెందుల డీఎస్పీ చేపట్టారు.
సిట్ దర్యాప్తులపై సంతృప్తి చెందని వివేకా కుమార్తె సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హై కోర్టు ఆదేశాల మేరకు 2020జూలై 18న సీబీఐ రంగంలోకి దిగింది. ఎస్పీ స్థాయి అధికారి సుధాసింగ్ నేతృత్వంలో తొలుత దర్యాప్తు మొదలైంది. ఏడాది తిరగ్గానే ఆమెకు డీఐజీగా పదోన్నతి లభించడంతో మరో రాష్ట్రానికి బదిలీ అయ్యారు. ఇక 2021 జూలై 22న సీబీఐ ఎస్పీ రాంసింగ్ దర్యాప్తు అధికారిగా వచ్చారు. ఆయన వచ్చాకే విచారణ స్పీడప్ అయింది. 2021 అక్టోబరు 26న మొదటి చార్జిషీట్ దాఖలు చేశారు. 2022 జనవరి 31న మరో అనుబంధ చార్జిషీట్ కూడా వేశారు. సీబీఐకి బెదిరింపులు, ఎదురు కేసులు పెట్టినా ఆయన భయపడలేదు. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్రలపై కీలక ఆధారాలు సేకరించారు. అవినాశ్ రెడ్డిని నాలుగుసార్లు ప్రశ్నించారు. అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేసినప్పటికీ... హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆగిపోయారు.
ఇప్పుడు కేశవరామ్ చౌరాసియా నేతృత్వంలోని ఆరో సిట్ ఏర్పాటైంది. ఏప్రిల్ 30లోపు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో... ఈ సిట్ దర్యాప్తుకు సిద్ధమవుతోంది. మరి గడవులోగా... వివేక హత్య కేసు నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగిస్తుందా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com