Viveka Murder Case : వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బీపీ పెరిగింది

Viveka Murder Case : వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి  బీపీ పెరిగింది

వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ఆయనకు బీపీ పెరగడంతో సెలైన్‌ ఎక్కించారు. మరో భవనానికి తరలించి ఈసీజీతో పాటు ఇతర టెస్టులు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత భాస్కర్‌రెడ్డిని సీబీఐ జడ్జి ఎదుట హాజరుపర్చబోతున్నారు. భాస్కర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరే అవకాశముంది. మరోవైపు భాస్కర్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఆయన న్యాయవాదులు కూడా మెజిస్ట్రేట్‌ ఇంటికి చేరుకున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సీబీఐ అధికారులు.. అక్కడ్నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

ఇవాళ తెల్లవారుజామున ముఖేష్ శర్మ నేతృత్వంలోని సీబీఐ బృందం పులివెందులకు చేరుకుంది. ఉదయం ఐదున్నర గంటల సమయంలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ బృందం అదుపులోకి తీసుకుంది. ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి భాస్కర్ రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లోకి ఎవర్నీ అనుమతించలేదు. అయితే కీలక ఆధారాలు సేకరించి భాస్కర్ రెడ్డి ఇంట్లోనే అరెస్ట్ మెమోను రెడీ చేసి.. ఆయన భార్యకు ఇచ్చారు. తన ఇంట్లోకి లాయర్‌ను అనుమతించాలని పదేపదే భాస్కర్ రెడ్డి కోరారు. అరెస్ట్ మెమోలో ఏముందో తమ లాయర్ ద్వారా తెలుసుకుంటామని భాస్కర్ రెడ్డి.. అధికారుల్ని అడిగారు. కానీ ఆయన వినతిపై సీబీఐ అధికారులు స్పందించలేదు. భాస్కర్‌రెడ్డిపై సెక్షన్ 120బి, రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు సుప్రీం కోర్టు పెట్టిన డెడ్‌లైన్‌తో సీబీఐ పరుగులు పెడుతోంది. రెండు వారాలే వ్యవధి ఉండడంతో.. కేసులో మరింత వేగం పెంచింది. సుప్రీం డెడ్‌లైన్‌ ఈనెల 30తో ముగుస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామునే పులివెందుల వెళ్లిన సీబీఐ బృందం.. వైఎస్‌ భారతీరెడ్డి మేనమామ.. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేసింది. భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌తో వైసీపీ శ్రేణుల్లో ప్రకంపనలు చెలరేగాయి. సీబీఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ నెక్స్ట్‌ టార్గెట్‌ ఎంపీ అవినాష్‌ రెడ్డే అనే ప్రచారం జరుగుతోంది.

వివేకా హత్యోదంతం కేసు విచారణ చివరి అంకానికి చేరుకుంటున్న క్రమంలో.. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని.. ఇవాళ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. వివేకా హత్యకు పన్నిన కుట్రలో సూత్రధారుడిగా అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అరెస్టు వారెంట్‌ను సీబీఐ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు. అటు.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుపై కడప జిల్లాలో వైసీపీ నామమాత్రపు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

మరోవైపు సీఎం జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. నార్పల మండల కేంద్రంలో జరగనున్న.. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సీఎం పర్యటన రద్దయినట్లు కలెక్టర్‌ అధికారికంగా ప్రకటించారు. వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ తర్వాత అవినాష్‌ రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్‌ చేస్తుందన్న వార్తలు వైసీపీలో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ అనంత పర్యటన రద్దు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story