Viveka Murder Case: హైకోర్టును ఆశ్రయించిన భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌రెడ్డి

అటు.. వివేకా హత్య కేసులో తాను నిర్దోషినంటున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. సీబీఐ రెండో రోజు విచారణ కొనసాగుతుండగానే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేకుండానే సీబీఐ తమను అరెస్ట్ చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి హైకోర్టును కోరారు. ఇక వివేకాను తామే హత్య చేశామనడానికి సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గూగుల్ టేక్ అవుట్ లొకేషన్ ఆధారంగా సీబీఐ తమను అరెస్ట్ చేయడం సరికాదని పిటిషన్‌లో తెలిపారు. ఇక భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
మరోవైపు సీబీఐ కస్టడీలో ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రెండో రోజు విచారణ కొనసాగుతుంది. ఢిల్లీ సీబీఐ విభాగానికి చెందిన ఎస్పీ వికాస్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ముగ్గురిని ప్రశ్నిస్తోంది. వీరిని రెండో రోజు కస్టడీకి తీసుకున్న సీబీఐ.. చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి తరలించింది. ఈ నెల 24 వరకు ఆరు రోజులపాటు వీరిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. అటు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సీబీఐ ఆఫీస్‌కు వచ్చారు. అవినాష్‌రెడ్డిని సైతం ఈ నెల 25 వరకూ సీబీఐ విచారణ ఎదుర్కొనున్నారు. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు మాత్రం లేవు. 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేవలం విచారణ మాత్రమే చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com