Viveka Murder Case: వివేకా హత్య వెనుక జగన్‌ హస్తం ఉందన్న దస్తగిరి

Viveka Murder Case: వివేకా హత్య వెనుక జగన్‌ హస్తం ఉందన్న  దస్తగిరి
వివేకా దారుణ హత్య రాజకీయ కుట్రలో భాగమేనన్న దస్తగిరి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకాను సీఎం జగన్‌ చంపించారని...అదే కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు. వివేకా కేసులో అప్రూవర్‌గా మారడంతో తనను బెదిరస్తున్నారని ఇటీవల కడప జైల్లో చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో జరిగిన ఘటనలపై విచారణ చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు, సీబీఐకి దస్తగిరి లేఖ రాశారు. వివేకాను చంపిన తనకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారన్న దస్తగిరి...బాబాయ్‌ను చంపిన జగన్‌కు పులివెందులలో ఓటు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.

వివేకా హత్య వెనక సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారని అప్రూవర్‌ దస్తగిరి అన్నారు. అప్రూవర్‌గా మారిన తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ చిత్రహింసలకు గురిచేశారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఓ కేసు విషయంలో తాను నాలుగు నెలల పాటు కడప జైల్లో రిమాండ్‌లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి కలిసి బెదిరించారని తెలిపారు. వారు చెప్పినట్లు వినకపోతే ప్రాణాలతో ఉంచమని.. నరికేస్తాం అంటూ హెచ్చరించారని వివరించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలని కోరారని.. దానికి అంగీకరించకపోవడంతో ఆవేశంతో ఊగిపోతూ చైతన్యరెడ్డి తీవ్ర స్థాయిలో బెదిరించారని, జైలు అధికారులూ చిత్ర హింసలు పెట్టారని కడప ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దస్తగిరి వెల్లడించారు. కడప జైల్లో జరిగిన ఘటనలపై విచారణ జరపాలని కోరుతూ సీబీఐ, జైళ్లశాఖ డీజీ, కడప ఎస్పీ, నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి, తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాశారు.

గత ఏడాది అక్టోబరు 30 నుంచి 31 వరకు ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, డీఎస్పీ నాగరాజులు తనపై ఉన్న అట్రాసిటీ కేసు అడ్డం పెట్టుకుని వివేకా హత్యకు సంబంధించి అవినాష్‌రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు దస్తగిరి లేఖలో పేర్కొన్నారు. అప్రూవర్‌గా మారడానికి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ తనను కొట్టి ఒప్పించారని.. కోర్టులో చెప్పాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేశారని చెప్పారు. దానికి అంగీకరించకపోవడంతో అరెస్టు చేసి జైలుకు పంపారని వివరించారు. నవంబరులో వైద్య శిబిరం పేరిట చైతన్యరెడ్డి కడప జైల్లో ఎస్‌ఎస్‌ఆర్‌ బ్యారెక్‌లో తనను కలిసి హెచ్చరించారని దస్తగిరి తెలిపారు. నా భార్య మీడియాతో మాట్లాడి ఆరోపణలు చేస్తున్న విషయం తెలుసుకున్న జైలు అధికారులు.. తనను చిత్రహింసలు పెట్టారని వివరించారు. 14 రోజుల పాటు 24 గంటలూ లాకప్‌లోనే ఉండే విధంగా చేసి హింసించారని, తాను భరించలేక లాకప్‌లో ఉన్న దుప్పట్లతో ఉరేసుకుని చనిపోతానని చెప్పడంతో జైలు సూపరింటెండెంట్‌ కాసేపు బయటికి వదిలి మళ్లీ లాకప్‌లో పెట్టారని లేఖలో ప్రస్తావించారు.


Tags

Read MoreRead Less
Next Story