VIZAG: విశాఖలో డిసెంబర్ 12 నుంచి " కాగ్నిజెంట్" కార్యకలాపాలు

సాగర తీరం విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఏపీ ప్రభుత్వం ఉద్దేశానికి అనుగుణంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఐటీ సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గూగుల్, యాక్సెంచర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో కాగ్నిజెంట్ క్యాంపస్ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. డిసెంబర్ 12 నుంచి విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. తాత్కాలిక భవనం నుంచి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. మధురవాడ ఐటీ జోన్లో 800 సీట్ల సామర్థ్యం ఉన్న తాత్కాలిక భవనంలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో కాగ్నిజెంట్ తన కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. మధురవాడ ఐటీ జోన్, హిల్ నంబర్ 2లోని మహతి బిల్డింగ్ ఇందుకు కేటాయించారు. విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకూ ఈ భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తారు.
డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియా
‘డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా అవతరిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖపట్నంలో రిలయన్స్-జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ రూ.98వేల కోట్లు పెట్టుబడి పెట్టనుందని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దీని ద్వారా ఒక గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందన్నారు. ఈ మెగా - ప్రాజెక్ట్‌తో డేటా రంగంలో దేశానికి విశాఖ తలమానికం కానుందని చెప్పారు. ఏపీలో భారీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వేగవంతం అవుతుండటంతో, కొత్త టెక్నాలజీ - ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

