VIZAG: మద్యం మత్తులోనే విశాఖ అగ్ని ప్రమాదం

VIZAG: మద్యం మత్తులోనే విశాఖ అగ్ని ప్రమాదం
సిగరెట్లు పక్క బోటులో పడేశారన్న సీపీ... నైలాన్ వలకు నిప్పు అంటుకోవడం హార్బర్‌లో ప్రమాదం

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఈనెల 19వ తేదీ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు వ్యక్తులు నిర్వాకం వల్లే విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులో సిగరెట్‌ తాగి పక్క బోటుపై వేయడంతో నైలాన్‌ వలకు అంటుకుని మంటలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్ లోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేశారు. అగ్ని ప్రమాదానికి ముందు ఇద్దరు వ్యక్తులు ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటు నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. బోట్లలో వంట పని చేసే వాసుపల్లి నాని, అతని మామ బోట్లలో వాచ్‌మెన్‌గా పనిచేసే సత్యం అగ్నిప్రమాదానికి కారణమని తేల్చారు.

వాసుపల్లి నాని, అతడి మామ సత్యం ఓ బోటులో కూర్చుని చేపల ఫ్రై చేసుకుని, మద్యం తాగి పార్టీ చేసుకున్నారు. ఆ మత్తులో సిగరెట్ కాల్చి పక్కబోటులోకి విసిరేయడంతో నైలాన్ వలకు మంటలు అంటుకున్నాయని బోటులో డీజిల్ ఉంటడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా చాలామంది అనుమానితులను విచారించామని అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారని సీపీ రవిశంకర్‌ తెలిపారు. నిందితుడి పేరును పోలి ఉండటంతోనే... యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని కూడా పోలీసులు విచారించారని..అతడి ప్రమేయం లేదని తేలడంతో విడిచిపెట్టినట్లు చెప్పారు.


విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ పర్యవేక్షణ చేస్తామన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం మత్స్యకారులకు వేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందన్న మత్స్యకారులు తమ ఉపాధి ప్రశ్నార్థకమైందని వాపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అటు బోటులో కొందరు యువకులు పార్టీ చేసుకున్నారని తొలుత అందులో మంటలు చెలరేగి.. కొద్దిక్షణాల్లోనే పక్క బోట్లకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి 11 గంటలపుడు ఒక బోటుతో మొదలైన మంటలు నిలిపి ఉంచిన బోట్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోర్ట్ ఫైర్ ఇంజన్లు నాలుగైదు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశాయి.

Tags

Next Story