ఉక్కు ఉద్యమానికి ఢిల్లీ రైతు ఉద్యమ నాయకుల సంఘీభావం

ఉక్కు ఉద్యమానికి ఢిల్లీ రైతు ఉద్యమ నాయకుల సంఘీభావం
స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరింత తీవ్రతరం చేసింది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న కార్మికుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఉద్యోగుల దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరింత తీవ్రతరం చేసింది. నష్టాలు వచ్చాయని పరిశ్రమలను తెగనమ్మడం దారుణమని, స్టీలుప్లాంట్‌ పరిరక్షణకు అన్ని పార్టీలు కలసి రావాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏ పరిశ్రమకు అయినా భూములు కేటాయిస్తే వారు అమ్ముకోవడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమ నాయకులు ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి త్వరలో విశాఖకు రానున్నారని పరిరక్షణ కమిటీ తెలిపింది. రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం కానుందని నాయకులు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ఉక్కు కార్మికులు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని, పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీకి సమ్మె నోటీసు అందజేశారు. ఈనెల 25 తరువాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది.

స్టీల్‌ప్లాంట్‌ను త‌మ ప‌రిధిలోకి తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ముందుకొస్తే.. ఆ విష‌యంపై కేంద్ర స‌ర్కారు ఆలోచిస్తుంద‌ని కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నష్టాల్లో కొన‌సాగుతోన్న విశాఖ ఉక్కు పరిశ్రమను నడపడం ప్రభుత్వానికి భారంగా మారిందని అన్నారు.



Tags

Read MoreRead Less
Next Story