VJA: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరో అపచారం

VJA:  విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరో అపచారం
X
శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే పాలలో పురుగులు..?

విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. పదిహేను రోజుల వ్యవధిలో మూడు ఘటనలు జరగడం ఆలయ నిర్వహణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. డిసెంబర్ 27న అమ్మవారి ఆలయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం మొదటి ఘటనగా నమోదైంది. పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో పవర్ కట్ జరగడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో వివాదాస్పద పరిణామం చోటుచేసుకుంది. శ్రీచక్ర అర్చనలో ఉపయోగించిన పదార్థాల విషయంలో అపచారం జరిగినట్లు ఆలయ అర్చకులు గుర్తించారు. శ్రీచక్ర అర్చనలో వినియోగించే గోక్షీరంలో పురుగులు కనిపించడంతో అర్చకులు వెంటనే పూజను నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. అమ్మవారి పూజల్లో తప్పనిసరిగా తాజా గోవు పాలు వినియోగించాలన్న నిబంధన ఉండగా, టెట్రా ప్యాక్ పాలను ఉపయోగించడంపై అర్చకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సంప్రదాయాలకు విరుద్ధమని వారు స్పష్టం చేసినట్లు సమాచారం.

పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆలయ అర్చకులు వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆలయ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో తక్షణమే తాజా గోవు పాలు పంపించాలని సందేశం పంపడంతో సుమారు అరగంట తర్వాత పాలను తెప్పించారు. ఈలోగా అర్చన నిలిచిపోవడంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. అనంతరం గోక్షీరం అందిన తర్వాత శ్రీచక్ర అర్చనను తిరిగి ప్రారంభించారు.

Tags

Next Story