Guntur: వాలంటీరీ ఉద్యోగులు అత్యుత్సాహం

Guntur: వాలంటీరీ ఉద్యోగులు అత్యుత్సాహం
రాత్రివేళలో టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి, ఎందుకు వచ్చారో చెప్పకుండా ఫొటోలు తీశారు.

గుంటూరులో వాలంటీర్‌,సచివాలయ ఉద్యోగులు అత్యుత్సాహం చూపారు. రాత్రివేళలో టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి, ఎలాంటి అనుమతి లేకుండా.. అసలు ఎందుకు వచ్చారో చెప్పకుండానే ఫొటోలు తీశారు. ప్రశ్నిస్తే.. తాము వాలంటీర్లమని, మ్యాపింగ్‌ చేసేందుకు వచ్చామని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్‌ వాసులు వారిని నిర్బంధించారు.

గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో చాలా మంది టీడీపీ నేతలు నివాసముంటున్నారు. నిన్న రాత్రి ఆ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్లలోకి మహిళా వాలంటీరు వెళ్లి ఎందుకు వచ్చారో కూడా చెప్పకుండా ఫొటోలు తీశారు. ముందుగా కార్పొరేషన్‌ మాజీ ఫ్లోర్‌లీడర్‌ బంధువుల ఇంటికి వెళ్లారు. వాలంటీర్‌ ఫొటో తీస్తుంటే ఎందుకు తీస్తున్నారని ఆమెను ప్రశ్నించి బయటకు పంపారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి..ఆయన భార్య ఫొటో తీసేందుకు ప్రయత్నించగా ఆమె వారిపై మండిపడ్డారు. తాను వాలంటీర్‌నని, జగనన్న సురక్ష పథకం కింద మ్యాపింగ్‌ చేస్తున్నామని, అందుకే ఫొటోలు తీస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక్కడ మాకు మీతో పనేమీ లేదని మాజీ ఎమ్మెల్యే భార్య సీరియస్‌ అయ్యారు. ఈ విషయం ఆమె తన సోదరుడికి చెప్పగా.. ఆయన స్థానికులతో కలిసి వారిని నిర్బంధించారు. గతంలోనూ వచ్చి ఆధార్‌ వివరాలు తీసుకెళ్లారని, మళ్లీ ఇప్పుడు ఎందుకొచ్చారని వారిని నిలదీశారు.

అనుమతి లేకుండా తమ ఇళ్లకు వచ్చి సురక్ష పథకం అంటూ వివరాలు ఎలా అడుగుతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. తమ ప్రాంతంలో పథకాలు పొందేవారు ఎవరూ లేకున్నా ప్రతిసారీ వచ్చి ఎందుకు వివరాలు తీసుకుంటున్నారని నిలదీశారు. టీడీపీ వారి ఓట్లు తొలగించేందుకే వైసీపీ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story