Vuyyuru: ప్రాణం తీసిన బైక్ విన్యాసం.. 15 రోజులు మృత్యువుతో పోరాడి..

Vuyyuru: ప్రాణం తీసిన బైక్ విన్యాసం.. 15 రోజులు మృత్యువుతో పోరాడి..
Vuyyuru: యువకుల చేతిలో బైక్ ఉంటే గాల్లో తేలిపోతుంటారు. ఏ మాత్రం భయం లేకుండా ఏవేవో విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

Vuyyuru: యువకుల చేతిలో బైక్ ఉంటే గాల్లో తేలిపోతుంటారు. ఏ మాత్రం భయం లేకుండా ఏవేవో విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అదుపుతప్పితే ఒక్క క్షణంలో జీవితం అస్తవ్యస్థమవుతుందని తెలిసినా ఆ అలవాటు మానుకోరు.



సినిమాల్లో మాదిరిగా బైక్‌పై స్టంట్‌లు చేసి స్నేహితుల మెప్పు పొందాలనుకుంటారు.. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఉయ్యూరు పట్టణానికి చెందిన గౌరీ సాయికృష్ణ బైక్‌పై స్టంట్‌లు చేస్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తల రోడ్డుకు బలంగా తగలడంతో మెదడుకు దెబ్బ తగిలింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. 15 రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు.



8వ తరగతితో చదువు ఆపేసి స్థానికంగా ఉన్న ఓ బైక్ మెకానిక్ షెడ్డులో చేరాడు. మెకానిక్ పని నేర్చుకుంటూనే బైక్‌పై విన్యాసాలు చేయడం మొదలు పెట్టాడు. తల్లిదండ్రులు వారించినా వినలేదు. చేతికి అందిన కొడుకు చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. కన్న తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చి 18 ఏళ్ల సాయికృష్ణ ప్రమాదకర విన్యాసాలతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.


బైక్‌‌పై స్టంట్లు వద్దని ఎన్ని సార్లు మొత్తుకున్నా కొడుకు వినలేదని సాయికృష్ణ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దయచేసి ఎవరూ ఇలా చేయవద్దని కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని సాయికృష్ణ తండ్రి అతడి స్నేహితుల్ని వేడుకున్నారు. పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్న యువకులు కన్నీరుపెట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story