TTD: నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగియనున్నాయి. పదిరోజుల వ్యవధిలో 6 లక్షల 80 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022 లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా.. 2020-21లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. మరోవైపు రేపు దర్శనం చేసుకునే వారికి ఎలాంటి టోకెన్లు ఇవ్వబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సర్వదర్శనానికి సంబంధించి నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలిపింది. ప్రోటోకాల్ మినహా వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.
పెరిగిన రద్దీ
తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సెక్యూరిటీ సిబ్బంది తిరుమలకు పంపుతున్నారు. ఆదివారంతో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈనెల 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను టీటీడీ అధికారులు మూసివేయనున్నారు.
రోజుకు 70 వేల మంది
రోజుకు 70 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు కూడా ఒక ఉద్యోగికి ఐదు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేసింది. ఆదివారంతో వైకుంఠ ద్వారాలు మూసివేయనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కేవలం టోకెన్లు, టికెట్లు ఉన్నవారిని వైకుంఠ ద్వార దర్శనం అని టీటీడీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వీరంతా టోకెన్లు, టికెట్లు కలిగిన వారే అని అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com