ఆంధ్రాలో జరుగుతున్న మద్యం దందాపై ఈడీ ఎందుకు స్పందిస్తలేదు..!

ఆంధ్రాలో జరుగుతున్న మద్యం దందాపై ఈడీ ఎందుకు స్పందిస్తలేదు..!
ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు మించి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దందా నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి

ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు మించి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దందా నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపై ఈడీ విచారణ చేపట్టడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్‌ సిసోదియా సహా పలువురు ప్రముఖుల్ని అరెస్టు చేయటంతో పాటు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌నూ సీబీఐ ప్రశ్నించింది. ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణంలో ఈడీ పలువుర్ని అరెస్టు చేసింది. ఆయా రాష్ట్రాల్లో అంత చురుగ్గా వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థలు ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం వ్యాపారంపై ఎందుకు నజర్ పెట్టడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు ప్రభుత్వ పెద్దలే చక్రం తిప్పుతున్నారనే ఫిర్యాదులపై ఎందుకు స్పందించట్లేదని విపక్షాలు నిలదీస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ కంటే ఛత్తీస్‌గఢ్‌ చిన్న రాష్ట్రం. ఏపీలో 2వేల 934 ప్రభుత్వ మద్యం దుకాణాలుండగా ఛత్తీస్‌గఢ్‌లో 800 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి 23వేల 800 కోట్ల ఆదాయం వస్తే.. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి లభించింది 6వేల కోట్లే. ఛత్తీస్‌గఢ్‌లో మూడేళ్లలో 2 వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. అంతకు నాలుగు రెట్లు వ్యాపారం జరిగే ఆంధ్రప్రదేశ్‌లో అంతకు మించి అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి.

మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ.. ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితుల కనుసన్నల్లోనే సాగుతున్నాయని తీవ్ర ఆరోపణలున్నాయి. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు రంగంలోకి దిగితే ఇందులో చీకటి వ్యవహారాలన్నీ బయటకొస్తాయంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు, ఏపీఎస్‌బీసీఎల్‌ నుంచి అత్యధిక మద్యం ఆర్డర్లు దక్కించుకున్న అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విడదీయలేనంత అనుబంధముందని టాక్ వినిపిస్తోంది. అయినా సీబీఐ, ఈడీలు ఎలాంటి దర్యాప్తూ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story