REVANTH: కవిత అరెస్ట్‌ ఎన్నికల స్టంట్‌

REVANTH: కవిత అరెస్ట్‌ ఎన్నికల స్టంట్‌
బీఆర్‌ఎస్‌, బీజేపీ పెద్ద వ్యూహానికి తెరతీశాయన్న సీఎం రేవంత్‌రెడ్డి... లోక్‌సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని వెల్లడి

తెలంగాణలో కాంగ్రెస్‌ వందరోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నిమిషం ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేశామన్న రేవంత్‌ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించిన రేవంత్ హస్తంపార్టీని దెబ్బతీసేందుకే డ్రామాను పతాకస్థాయికి చేర్చారని మండిపడ్డారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన లోక్‌సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని స్పష్టంచేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్‌ అంశంపై బీఆర్‌ఎస్‌, బీజేపీ పెద్ద వ్యూహానికి తెరతీశాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు స్టంట్‌ చేస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే అరెస్ట్‌ తెరపైకి తెచ్చారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.


కుమార్తె కవిత అరెస్టుపై తండ్రిగా కనీసం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రశ్నించారు. కవిత అరెస్ట్‌ను ప్రధాని మోదీ సమర్థించకపోవడం, కేసీఆర్‌ మౌనం వెనుక వ్యూహమేంటని నిలదీశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్‌ఎస్‌, బీజేపీ చేస్తున్న ప్రకటనలను చూస్తూ ఊరుకోబోమని సీఎం హెచ్చరించారు. తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించబోదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ తల్చుకుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ముగ్గురో....... నలుగురో తప్ప ఎవరూ మిగలబోరని జోస్యం చెప్పారు. వందరోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను వివరించిన సీఎం గత పాలనలో చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. 30 వేల ఉద్యోగాలభర్తీ సహా ప్రతినెలా 1నే ఉద్యోగులకు జీతాలిచ్చేలా చర్యలు తీసుకున్నామని రేవంత్‌ గుర్తుచేశారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు పునరుద్ధరించామన్న సీఎం రేవంత్‌రెడ్డి... ప్రజలకు సంక్షేమ పాలనపై దృష్టి పెట్టామని తెలిపారురు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి.. వైబ్రైంట్‌ తెలంగాణ-2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వివరించారు. ‘‘కవిత అరెస్టును కేసీఆర్‌ ఖండించలేదు. ఆయన మౌనాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఆమె అరెస్టుపై కేసీఆర్‌, నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు. దాని వెనక వ్యూహం ఏంటి? గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు.. కానీ నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారు. కేసీఆర్‌ కుటుంబం, భాజపా మద్యం కుంభకోణాన్ని నిరంతర ధారావాహికలా నడిపించారు. ఈ అరెస్ట్‌ భాజపా, భారాస ఆడుతున్న డ్రామా. ఎన్నికల షెడ్యూల్‌కు ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? 12 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి. మమ్మల్ని దెబ్బతీసేందుకు భాజపా-భారాస చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. ఈ అరెస్టు ఎన్నికల స్టంట్‌. రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదు. ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు’’ అని రేవంత్‌ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story