Guntur: కలుషిత నీరు తాగి యువతి మృతి

Guntur:  కలుషిత నీరు తాగి యువతి మృతి
గుంటూరులో డయేరియా కలకలం

గుంటూరులో కొద్దిరోజులుగా సరఫరా అవుతున్న కలుషిత తాగునీరు ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. శారదా కాలనీకి చెందిన పద్మ అనే యువతి మరణించగా మరో కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. నగరంలో కలుషిత నీరు వస్తోందని ప్రజలు కొద్ది రోజులుగా గగ్గోలు పెడుతున్నా.... అధికార యంత్రాంగం స్పందించలేదు. యువతి మృతి, విపక్షాల ఆందోళనలతో అధికారులు హడావుడిగా చర్యలు చేపట్టారు.

గుంటూరులో కలుషిత నీరు తాగి ఓ యువతి మరణించడం... తీవ్ర కలకలం రేపింది. శారదా కాలనీకి చెందిన పద్మ అనే యువతి శుక్రవారం అనారోగ్యం పాలైంది. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడిన ఆమెను శనివారం ఉదయం జీజీహెచ్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ పద్మ మధ్యాహ్న సమయంలో మరణించింది. మృతురాలి తండ్రి 2 నెలల క్రితమే గుండెపొటుతో మృతిచెందగా....కుమార్తె మృతి వార్తతో తల్లి ఆసుపత్రి పాలైంది. పద్మ ఉండే ప్రాతంలోని మరో ముగ్గరు వాంతులు, విరేచనాలతో సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్‌ కాలనీ, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన మరి కొందరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల క్రితం సంగడిగుంటకు చెందిన ఓబులు అనే వ్యక్తి డయేరియాతో మరణించాడు. అప్పుడే అధికారులు మేల్కొని ఉంటే ఇప్పుడు ఇంత మంది ఆస్పత్రి పాలయ్యేవారు కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


గుంటూరు ప్రజలు కలుషిత తాగునీటితో అవస్థలు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం, జనసేన ధ్వజమెత్తాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయిందని ఆరోపించారు. యువతి మృతి చెందిన శారదా కాలనీ 50వ డివిజన్‌ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి డిప్యూటీ మేయర్‌ బాల వజ్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పైపులైన్లు అస్తవ్యస్థంగా తయారయ్యాయని స్థానికులు చెబుతున్నారు. మురుగు కాలవల నుంచి నీరు కుళాయిల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. యువతి మృతి చెందడంతో నగరపాలక సంస్థ అధికారులు హడావుడిగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఎవరైనా అనారోగ్యం పాలయ్యారా అనే వివరాలు సేకరిస్తున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన తాగునీరు గురించి అవగాహన కల్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story