AMARAVATHI: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు

AMARAVATHI: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు
X
రూ.3,535 కోట్ల నిధులు విడుదల.. ఊపందుకోనున్న రాజధాని పనులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకు నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు, ఏడీబీ రూ.6,700 కోట్లు కలిపి మొత్తం రూ.13,600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి. మరో రూ.1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో (ఎఫ్‌ఆర్‌బీఎం) లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి రూ.11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. అలాగే, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

సుస్థిర అభివృద్ధి ప్రాజెక్ట్‌కు...

అమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్ట్‌కు భారీ సాయం అందింది. అమరావతి ప్రాజెక్టు ఆర్థిక సాయానికి ఇచ్చిన హామీ మేరకు.. ప్రపంచ బ్యాంక్ నిధులు విడుదల చేసింది. మొదటి విడతగా రు. 3535కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ఈ నిధులతో అమరావతిని ఆధునిక, వాతావరణ-స్థిరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 2050 నాటికి 35 లక్షల మంది జనాభాను సమకూర్చేందుకు 217 చదరపు కిలోమీటర్ల నగరం కోసం ఏపీప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని...ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో సుమారు 1 లక్ష మంది నివసిస్తున్నారని ప్రపంచబ్యాంక్ తన నివేదికలో పొందుపరిచింది. నగర రవాణా అవసరాలను ప్లాన్ చేయడానికి, నిర్వహించడానికి కొత్త ఏకీకృత మెట్రోపాలిటన్ రవాణా అథారిటీని స్థాపించడంలోనూ... నీటి సరఫరా, మురుగునీటి వంటి ప్రాథమిక సేవల కోసం ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పింది.

ఏడీబీ భారీ రుణం

అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ చెరో రూ.6,700 కోట్ల చొప్పున రుణాన్ని గతేడాది డిసెంబరులో ఆమోదించాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత అప్పు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ వైసీపీ నేతలు కొందరు ఆ బ్యాంకుకు లేఖలు రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది. 2018లో కూడా వైసీపీ ఇలాంటి కుట్రలే చేసి అమరావతికి అప్పు రాకుండా అడ్డుపుల్లలు వేసిందని కూడా తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

Tags

Next Story