శిధిలావస్థకు చేరుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శిధిలావస్థకు చేరుకుంది. ఆలయం సమీపంలో బ్లాస్టింగ్‌ల కారణంగా క్షేత్రంలో రాతి దూలం విరిగి ప్రమాదకరంగా మారడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయం సమీపంలో మైనింగ్ గనుల్లో బ్లాస్టింగ్ లు చేపట్టడంతో భారీ శబ్దాల తీవ్రతతో ఆలయంలోని రాతి దూలం విరిగింది. ప్రమాదకరంగా మారిన స్థంభం కిందపడకుండా దేవాదాయశాఖ, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారులు తూతూ మంత్రంగా సపోర్టుగా పైపులు ఏర్పాటుచేసి చేతులు దులుపుకున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాగంటి దేవస్థానం నుంచి ఆరు కిలోమీటర్ల వరకు ఎలాంటి బ్లాస్టింగ్‌లు జరుపకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే దేవస్థానానికి వెళ్లే దారిలో వైట్ స్టోన్ గనులు ఉండటంతో...వాటికోసం అక్రమంగా బ్లాస్టింగ్‌లు చేపట్టి రాతిని తరలిస్తున్నారు. గతంలో భారీ బ్లాస్టింగ్‌లు చేపట్టడంతో వెంకటేశ్వర స్వామి గుహల్లో రాళ్లు పడి కొన్నిరోజులపాటు గుహలను మూసివేశారు. దీంతో అప్పట్లో అధికారులు గుహల సమీపంలో బ్లాస్టింగ్‌లు జరుపకుండా చర్యలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో గనుల్లో బ్లాస్టింగ్‌లు చేపట్టడంతో దేవాలయం కంపించి పగుళ్లు ఏర్పడుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం సమీపంలో బ్లాస్టింగ్‌లు నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com