మండలి చైర్మన్ షరీఫ్‌కు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ

మండలి సమావేశాలకు టీవీ5తో పాటు ఇతర ఛానళ్లను అనుమతించాలంటూ చైర్మన్ షరీఫ్ లేఖ రాశరు మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు. మండలి సమావేశాల కవరేజీకి మీడియాను అనుమతించక పోవడం అప్రజాస్వామికమని.. రాజ్యాంగ వ్యతిరేకమని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సభ సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం శోచనీయమన్నారు. చట్టసభలకు టీవీ5తో పాటు ఇతర ఛానళ్లెపై ఆంక్షలు విధించడాన్ని ఖండిస్తున్నాను అన్నారు. బ్లూ మీడియాను మాత్రమే అనుమతించి మిగిలిన మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించక పోవడం అప్రజాస్వామికని మండిపడ్డారు.
ఇలాంటి నియంత పోకడలు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలైన చట్టసభలకు విరుద్ధమంటూ లేఖలో గుర్తు చేశారు. పార్లమెంటరీ వ్యవస్థకు తూట్లు పొడిచేలా వైసిపి ప్రభుత్వ నిర్ణయాలను ఉండడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులు చట్టసభలకు జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు. సభా ప్రసారాలను ప్రత్యక్షంగా చూసే హక్కు ప్రజలకు ఉందన్నారు. ప్రసార సంస్థలు, పార్లమెంటరీ వ్యవస్థ మధ్య బలమైన బంధం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత వీటిపైనే ఉందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఘనుడని యనమల ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com