15 Nov 2020 7:19 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / వైసీపీని ప్రజల్లో...

వైసీపీని ప్రజల్లో చులకన చేస్తున్న నేతలు

వైసీపీని ప్రజల్లో చులకన చేస్తున్న నేతలు
X

వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది.. ఫ్యాన్స్‌ కుమ్ములాటలతో వీధికెక్కుతున్నారు.. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు దాడులు చేసుకుంటూ ప్రజల్లో పార్టీని చులకన చేస్తున్నారు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా, వర్గ విభేదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.. ఓ వర్గం ఆధిపత్యాన్ని సహంచలేకపోతున్న మరో వర్గం కయ్యానికి కాలు దువ్వుతోంది.. చివరకు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అయితే, చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.. ఇక జగన్‌ సొంత నియోజకవర్గం ఇడుపులపాయలోనూ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇడుపులపాయలో వైసీపీకి తిరుగులేదని చెబుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రతిరోజూ తిట్టుకుంటూ, తన్నుకుంటూ పార్టీ అధ్యక్షుడు జగన్‌ వద్ద పంచాయితీలు పెడుతున్నారు. కొన్నిచోట్ల ఘర్షణలు హత్యల వరకు వెళ్తున్నాయి.. ఎందుకీ పరిస్థితి..? అధికార వైసీపీలో ఏంజరుగుతోంది..?

మొన్న కర్నూలు జిల్లా పత్తికొండ, ఆ తర్వాత కడప జిల్లా కొండాపురం.. తాజాగా పులివెందుల నియోజకవర్గం.. అధికార వైసీపీలో ఏదో ఒక చోట వర్గపోరు బయటపడుతూనే ఉంది.. ఫ్యాన్స్‌ మధ్య కొట్లాటలు నిత్యకృతంగా మారాయి. వైసీపీకి పెట్టనికోట కడప జిల్లాలో వర్గపోరు ఈ పరిస్థితికి దారితీస్తుందోనని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం, సీఎం జగన్ సొంత ఇలాఖా అయిన ఇడుపులపాయ వైసీపీలో గ్రూప్‌వార్‌ భగ్గుమంది. రెండు వర్గాలకు చెందిన వారు చిన్న విషయంలో మాటామాటా పెరగడంతో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. 8 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

జగన్ ప్రజాసంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమంలో ఈ వివాదం తలెత్తింది. రవిరెడ్డి వర్గానికి, YS కొండారెడ్డి వర్గానికి మధ్య ఘర్షణతో స్థానికంగా వర్గపోరు బహిర్గతమైంది. ఘర్షణకు దిగిన ఇరువర్గాలు ఇడుపులపాయ పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ గొడవపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు ఈ వ్యవహారం MP అనినాష్‌రెడ్డి దృష్టికి వెళ్లగా పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇదొక్కటే కాదు.. జిల్లాలో YCPలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కుతున్న ఘటనలు ఒక్కొక్కటిగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే జమ్మలమడుగులో YCP నేతల ఘర్షణలో రామసుబ్బారెడ్డి అనుచరుడు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. కొండాపురం మండలం పి.అనంతపురంలో రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోగా, గురు ప్రతాప్‌ రెడ్డి చనిపోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గండికోట నిర్వాసితులకు చెక్కుల విషయంలో రీ సర్వే చేస్తుండగా వివాదం తలెత్తింది.

ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య గత కొంత కాలంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. తాజా ఘటనతో ఇది మరింత దూరం వెళ్లింది.. తన అనుచరుడి హత్యపై రామసుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు.. హత్య చేసిన వారు ఎంతటివారైనా వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామం నివురుగప్పిన నిప్పులా మారింది.. గతంలో బి.కోడూరు మండలం పాయలకుంట దగ్గర వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సచివాలయ భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య ఎదుటే ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నాయి.

అటు, కర్నూలు జిల్లా పత్తికొండలోనూ ఇలాంటి గొడవే బయటపడింది. ఎమ్మెల్యే శ్రీదేవి వర్గానికి, పోచం మురళీధర్‌ రెడ్డి వర్గానికి మధ్య ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇక ఇప్పుడు కడప జిల్లాలోని ఇడుపులపాయలోనే YCP నేతలు పరస్పరం దాడులకు దిగడం చర్చనీయాంశమైంది.

  • By kasi
  • 15 Nov 2020 7:19 AM GMT
Next Story