జగన్ పాలనలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ

రాష్ట్రంలో ఒక్క పాఠశాలా మూతపడదని..గతంలో మూసివేసిన వాటినే తెరిపిస్తున్నామని ఊదరగొట్టిన సీఎం జగన్..సంస్కరణల పేరుతో ఊరి బడికి ఊరితాళ్లు వేశారు. ఎస్సీ, ఎస్టీల ఆవాసాల్లోని స్కూళ్లను మూసేశారు. వైకాపా వచ్చిన తర్వాత ప్రభుత్వ, ఎయిడెడ్ కలిపి 19 వందల 52 బడులకు తెరదించారు. పాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థులను సబ్జెక్టు టీచర్లతో బోధన పేరుతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడంతో..1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి...వాటిలో చాలా వరకు మూతపడ్డాయి. ప్రాథమిక పాఠశాలలు..విద్యార్థుల ఆవాసానికి కిలోమీటరు దూరంలో ఉండాలనే నిబంధనను విద్యా హక్కు చట్టాన్ని సవరించి మరీ ప్రభుత్వం మార్చేసింది.
ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసిన జగన్ సర్కారు ఆ వ్యవస్థను నాశనం చేసింది. ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్ సంస్థలను కనుమరుగు చేసింది. వాటిని ఆస్తులతో సహా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని... లేదంటే సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఆదేశించి, బలవంతంగా ఆ వ్యవస్థను లేకుండా చేయాలని చూసింది. దీన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినా ..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చేనాటికి 2 వేల 202 ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉండగా.. ప్రస్తుతం 837 మాత్రమే మిగిలాయి. 845 బడులు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిబ్బందిని వెనక్కి ఇచ్చేసి.. ప్రైవేటుగా మారిపోయాయి. 423 బడులు కాలగర్భంలో కలిసిపోయాయి. 122 జూనియర్ కళాశాలలకుగాను ప్రస్తుతం 44 మాత్రమే మిగిలాయి.137 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల సంఖ్య 63కి పడిపోయింది. 6 కళాశాలలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి నిర్వహణ అప్పగించేశాయి. మరో 68 ప్రైవేటుగా మారిపోయాయి.
టీచర్ల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీన ప్రక్రియలకు తెరతీసింది. ఉన్నవారినే సర్దుబాటు చేసి, కొత్త నియామకాలు లేకుండా చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 88 వేల 162 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. లక్షా 69 వేల 642 మంది మాత్రమే పని చేస్తున్నారు. 18వేల 520 ఖాళీలున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిగా ముందు 6 వేల 100 పోస్టులకు డీఎస్సీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసింది. చివరకు ఎన్నికల కోడ్‌తో అదీ నిలిచిపోయింది. గత ఎన్నికల ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పి, ఐదేళ్లల్లో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. పాదయాత్ర సందర్భంగా ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ ఒప్పంద ఉపాధ్యాయ పోస్టులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని జగన్ తుంగలో తొక్కి అసలా పోస్టులే లేకుండా చేశారు. 7 వేలకుపైగా ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, ఎస్జీటీ పోస్టులను రద్దు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com