మహిళా వాలంటీర్ ను లైంగికంగా వేధించిన వైసీపీ నాయకుడు
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వైసీపీ నేతల తీరు వివాదాస్పదమవుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని ఓ వైసీపీ నాయకుడు వేధిస్తున్నాడంటూ మహిళా వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్దపంజాని మండలం వీరప్పవల్లి పంచాయతీకి చెందిన వైసీపీ నాయకుడు ఎర్రబల్లి శ్రీనివాస్ తనను లైంగిక వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇష్టం వచ్చిన వాళ్లను పెట్టుకుంటానని.. ఫోన్‌లో బూతులు తిడుతున్నాడని వాపోయింది.
తన తప్పు లేదని ఎంత ప్రాధేయపడినా ఆ నాయకుడి మనసు కరగలేదని బాదితురాలు ఆరోపిస్తోంది.. తనను శారీరకంగా లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని.. ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆడియో టేపులతోపాటు ఇతర ఆధారాలను ఇవ్వడంతో వైసీపీ నాయకుడు ఎర్రబల్లి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. అటు వైసీపీ నేత నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ, ఎమ్మెల్యేలకు కూడా ఆడియోలు పంపామని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రశ్నిస్తే దాడులు.. న్యాయం కోసం అడిగితే వేధింపులు ఎన్నాళ్లని ప్రజా సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే దిశ చట్టం అధికార పార్టీ నేతలకు వర్తించదా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com