AP: నిబంధనలకు పాతర.. ఓట్ల తొలగింపులో జాతర..!

AP: నిబంధనలకు పాతర.. ఓట్ల తొలగింపులో జాతర..!
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. అడ్డదారులు తొక్కుతున్న అనంత వైసీపీ నాయకులు

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నారు అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు. ఏదైనా ఒక పోలింగ్ బూత్ పరిధిలో పది ఓట్లను తొలగించాలని ఫిర్యాదులు వస్తేనే మండల స్థాయి అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఇదే వందల ఓట్లను తొలగించాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి విచారణ కమిటీలను వేయాలి. ఈ నిబంధనలు ఎన్నికల కమిషన్‌లో స్పష్టంగా పొందుపరిచారు. కానీ ఉరవకొండలో నిబంధనలన్నీ చెత్తబుట్ట పాలయ్యాయి. ఏకంగా 7వేల 500 ఓట్లను తొలగించాలని విశ్వేశ్వర రెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఓటర్లు అందరూ ఉరవకొండ నియోజకవర్గంలో నివసింకుండా వలస వెళ్లిపోయారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇన్ని వేల ఓట్లపై ఫిర్యాదును కూడా జిల్లా అధికారులు తీసుకునేందుకు నిబంధనలు పర్మిట్ చేయవు. అయినప్పటికీ ఓట్ల తొలగింపు కోసం విచారణ కమిటీలను నియమించారు జెడ్పీ సీఈవో. ఆ మేరకు అధికారులు ఆగమేఘాలపై విచారణ చేసి ఏక మొత్తంగా వేలాది ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు.

విషయం తెలుసుకున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరోక్షంగా జిల్లా కలెక్టర్ కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్న అనుమానాలను వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. మరోవైపు టీడీపీ నాయకులు సైతం ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వలస వెళ్లిన వారి ఓట్ల తొలగింపునకు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతియుతంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో చిచ్చు రగిలే ప్రమాదం పొంచి ఉంది. ఏదిఏమైనా వేలాది ఓట్లను గంపగుత్తగా తొలగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూనుకోవడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. అసలే వందల ఓట్ల తేడాతో ఫలితాలు వచ్చే ఉరవకొండ లాంటి నియోజకవర్గంలో వేలాది ఓట్ల తొలగింపు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

గతంలో ఉరవకొండ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో వందల సంఖ్యలో ఓట్లను తొలగించిన విషయంపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టింది. ఈ విచారణ కొనసాగుతుండగానే మరో ఏడు వేల ఓట్లను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌ను కలిశారు పయ్యావుల. ఓటర్ లిస్ట్ నుంచి బల్క్ రిలేషన్ చేయడానికి జిల్లా కలెక్టర్‌తో పాటు ఎన్నికల సంఘాలకు కూడా అధికారం లేదన్న విషయాన్ని చట్టంలోనే పొందుపరిచారని, అలాంటప్పుడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఇచ్చిన లిస్టుపై ఏ విధంగా ఎంక్వైరీ చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

ఉరవకొండలో ఇప్పటికే తొలగించారన్నదానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఒకవైపు విచారణ చేస్తుందని పయ్యవుల వివరించారు. మరోవైపు వేల సంఖ్యలో ఓటర్లను తొలగించేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తుందంటూ మండిపడ్డారు. ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల టీడీపీ ఓటర్లను తొలగించి, దొంగ ఓట్లు నమోదు చేయించడంలో వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. బీఎల్‌వోల ద్వారా క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టారు. ఆ సర్వే ఒకవైపు జరుగుతుండగానే, మరోవైపు వేల ఓట్లు తొలగించేందుకు అధికార పార్టీ నేతలకు అధికారులు సహకరిస్తున్నారంటూ పయ్యావుల ఫైరయ్యారు. ఈ అక్రమాలన్నింటిపై టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలకు పాతర.. ఓట్ల తొలగింపులో జాతర..!

Tags

Next Story