జగన్‌ పాలనలో వైసీపీ నేతలే కన్నీరు పెడుతున్న ఘటనలు

జగన్‌ పాలనలో వైసీపీ నేతలే కన్నీరు పెడుతున్న ఘటనలు

జగన్‌ పాలనలో వైసీపీ నేతలే కన్నీరు పెడుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి.. అధికార పార్టీలోని కొందరు నేతలు తమ వర్గం వారినే టార్గెట్‌ చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది.. కర్నూలు, కడప జిల్లాల్లో వర్గపోరు బయటపడగా, అనంతపురం జిల్లాలో ఓ మంత్రి దౌర్జన్యకాండ వెలుగులోకి వచ్చింది.. మంత్రి శంకర్‌ నారాయణ తీరుపై అనంతపురం జిల్లా వైసీపీ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు నాగభూషణం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం తమ్మినాయనపల్లి గ్రామం దగ్గర ఐదెకరాల భూమిని కొనుగోలు చేశామని నాగభూషనం రెడ్డి చెబుతున్నారు. అయితే, ఈ భూమి ప్రభుత్వానిదంటూ రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేశారని ఆరోపిస్తున్నారు. పొలంలో చెట్లను అధికారులు పీకేస్తున్న సందర్భంలో పొలం నిర్వాహకులు వారితో వాగ్వాదానికి దిగారు.. పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు చెట్లను పీకేస్తుండగా, వారిని అడ్డుకున్నారు.. పోలీసులు పొలం నిర్వాహకుణ్ని వెనక్కు ఈడ్చుకెళ్లారు.. ఎందుకింత అన్యాయం చేస్తున్నారంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. నోటీసులు చూపించాలని అధికారులను ప్రశ్నించడంతో ఏదైనా ఉంటే తహసీల్దార్‌కు చెప్పుకోవాలంటూ వారి పని వారు చేసుకు వెళ్లిపోయారు.

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి శంకర్‌ నారాయణ వర్సెస్‌ వైసీపీ నేతలుగా పరిస్థితి మారింది.. మంత్రి అయిన తర్వాత శంకర్‌ నారాయణ స్థానిక నాయకులను పట్టించుకోవడం లేదని, కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నించినందుకు తనపై దౌర్జన్యాలకు దిగుతున్నారని నాగభూషణం ఆరోపిస్తున్నారు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ప్రశ్నించినందుకు ఇలా దాడులకు తెగబడుతున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తమకు రక్షణ కల్పించాలని నాగభూషణం రెడ్డి అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story