AP: వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష పడ్డ కేసు పూర్వపరాలు ఏంటంటే..?

AP: వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష పడ్డ కేసు పూర్వపరాలు ఏంటంటే..?
మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులును దోషిగా తేల్చిన కోర్టు.. . 28 ఏళ్ల తర్వాత ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తుది తీర్పు...

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడైన MLC, మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులును కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు 18 నెలల జైలు, రెండున్నర లక్షల జరిమానా విధించింది. ఇదే కేసులో మొత్తం 10 మందికి శిక్ష వేసింది. న్యాయస్థానం తీర్పును దళిత, ప్రజాసంఘాలు స్వాగతించాయి. 28 ఏళ్లుగా పోరాడుతున్న తమకు కోర్టు న్యాయం చేసిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో వైసీపీ నేత తోట త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు ఎట్టకేలకు శిక్ష పడింది. 1996 డిసెంబర్ 29న జరిగిన ఈ ఘటనపై 28 సంవత్సరాల తర్వాత విశాఖ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తుది తీర్పు ఇచ్చారు. 1996 నుంచి ఈ కేసులో మొత్తం 143 వాయిదాలు పడ్డాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా మరో 9 మందిని దోషులుగా తేల్చారు. 18 నెలల జైలు శిక్షతోపాటు 20వేల నుంచి లక్షన్నర వరకు జరిమానా విధించారు. బాధితులు కొట్టి చిన్నరాజు, దడాల వెంకటరత్నానికి లక్షా 20 వేలు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయం జరిగినందుకు న్యాయస్థానాల పట్ల నమ్మకం పెరిగిందన్నారు.

విశాఖ న్యాయస్థానం తీర్పు పట్ల ప్రజా సంఘాలు , దళిత సంఘాలు , రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎన్నికలో పోటీ చేసే అవకాశం రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ కోర్టు తీర్పును న్యాయవాదులు స్వాగతించారు. దోషిగా తేలిన వైసీపీ MLC తోట త్రిమూర్తులుకు సరైన శిక్ష పడలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు శిరోముండనం కేసులో తుది తీర్పు వెలువడడంతో... పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటాయపాలెంతో పాటు ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ కేసు ఏంటంటే..?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెలో 1996 డిసెంబర్ 29న శిరోముండనం కేసు వెలుగుచూసింది. బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభి రామయ్య, పువ్వల వెంకటరమణ అమ్మాయిల పట్ల ఈవ్ టీజింగ్‌కు పాల్పడినట్టు నంది బొమ్మ వద్ద అసభ్యకరంగా రాతలు రాశారని ప్రధాన ఆరోపణలు. వీరిలో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులు జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు వెంకటాయపాలెంలోని ఇంటి వద్ద.... తోట బాబులు, తోట రాము, తోట పుండరీకాక్షలు, తోట బాబి, తలాటం మురళీ మోహన్, దేవళ్ల కిశోర్, తోట శ్రీను, మంచం ప్రకాష్, ఆచంట రామసత్యనారాయణలతో కలిసి బాధితుల్లో ఇద్దరికి శిరోముండనం చేయింటినట్టు, కనుబొమ్మలు తీయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల్ని చిత్రహింసలకు గురి చేశారని ప్రధాన ఆరోపణలు. ఈ వ్యవహారంపై ద్రాక్షారామ పోలీస్‌ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story