Visakha : విశాఖ తీరంలో యువతి 12 గంటలు నరకయాతన..

Visakha :  విశాఖ తీరంలో యువతి 12 గంటలు నరకయాతన..
ఇంట్లోంచి పారిపోయి, కొండపై నుంచి కింద పడిన యువతి

యువకుడితో కలిసి గుట్టలపైకి ఎక్కిన ఓ యువతి ప్రమాదవశాత్తూ రాళ్ళ మధ్య పడిపోయింది. భయంతో యువకుడు పరారవడంతో సాయం చేసేవారు లేక 12 గంటల పాటు నరకయాతన అనుభవించింది. వింతైన ఈ సంఘటన విశాఖ నగర శివారులోని అప్పికొండ సాగర తీరంలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి, భీమవరానికి చెందిన వర్మరాజు అనే యువకుడితో కలిసి అక్టోబర్ 2వ తేదీ నుంచి నుంచి అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న కొండపై ఉంటున్నారు. అయితే అనుకోకుండా ఆమె ఆదివారం సాయంత్రం కొండపైనుంచి పడిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, జన సంచారం లేని ప్రదేశం కావడంతో యువతి భయపడింది. అలాగే రాత్రంతా మృత్యువుతో పోరాడింది. సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు యువతిని చూడగా.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. కాలుజారి పడిపోయానని.. పరారీలో ఉన్న యువకుడిని ఏం అనవద్దని ఆమె చెబుతోంది. అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. వారు విశాఖ బయలుదేరి వెళ్లారు.

మరోవైపు కావ్య కనిపించడం లేదని 29వ తేదీన మచిలీపట్నంలో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు ఆమె తల్లి తెలిపారు. 29 నుంచి తమ కుమార్తె కోసం గాలిస్తున్నట్లు వాపోయింది. రెండు కాళ్లు,ఒక చెయ్యి విరిగిపోయాయని వివరించింది. యువతితో పరిచయం ఉన్న యువకుడే ఆమెను కొండపై నుంచి తోసేసి డబ్బు, బంగారం తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన కావ్యకు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన వర్మరాజుతో పరిచయం ఎలా ఏర్పడింది, ఏమి చెప్పి ఆమెను విశాఖ తీసుకెళ్లాడు, కొండ మీద వారం రోజులు ఎలా ఉన్నారనే దానికి సమాధానాలు దొరకాల్సి ఉంది.


Tags

Read MoreRead Less
Next Story