వివాహం జరగలేదంటున్న తేజస్విని తల్లిదండ్రులు.. యువతి మృతిపై అనుమానాలెన్నో..

వివాహం జరగలేదంటున్న తేజస్విని తల్లిదండ్రులు..  యువతి మృతిపై అనుమానాలెన్నో..
విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన యువతి ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ కేసులో అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి..

విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన యువతి ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ కేసులో అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. రెండు కుటుంబాలు చెబుతున్న వాదనల్లో ఏది నిజం అన్నది తేలాల్సి ఉంది. కేవలం దివ్య తన ప్రేమను నిరాకరించిందనే నాగేంద్ర ఇంత దారుణానికి దిగాడా..? అసలు నాగేంద్రబాబు ఎవరో తమకు తెలియని దివ్య కుటుంబ సభ్యులు చెబుతున్న మాటలు వాస్తవమేనా..? ఇటు దివ్యతో నాగేంద్రకు గతంలో రహస్య వివాహం అయ్యిందని అతడి కుటుంబ సభ్యుల వాదన ఎంత వరకు నిజం.. నిజంగానే పెళ్లి జరిగితే.. ఇంతకాలం దివ్య కుటుంబ సభ్యులు ఎందుకు తెలుసుకోలేకపోయారు. హత్య జరిగిన ముందు రోజు నాగేంద్రతో దివ్య తండ్రి మాట్లాడారా..? పట్టపగలే నాగేంద్ర బాబు మారణాయుధంతో దివ్య ఇంటిలోకి ఎలా ప్రవేశించాడు. ముందు వేసుకున్న పథకం ప్రకారమే నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడా..? మరి పథకానికి అతడికి సహకరించిన వారు ఎవరు..? లేదా క్షణికావేశంలోనే ఉన్మాదానికి దిగాడు.. ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి. హత్యకు దారి తీసిన కారణాలు ఏవైనా.. ప్రేమించలేదని.. ప్రేమించి మోసం చేసిందని..పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదనే కారణాలతో ఇలా ఉన్మాదాలకు పాల్పడడం దారుణం..

ప్రేమను నిరాకరించినందుకే తేజస్వినిని నాగేంద్రబాబు చంపాడని తొలుత ప్రచారం సాగింది. అయితే వారిద్దరూ కలిసి ఉన్న చిత్రాలు సాయంత్రానికల్లా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. నాగేంద్రబాబు స్నేహితుల్ని, స్థానికుల్ని పోలీసులు విచారించగా.. వారిద్దరికీ వివాహమైందని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ వివాహం విషయాన్ని తేజస్విని తల్లిదండ్రులు ఖండించారు. నాగేంద్రబాబు ఎవరో తమకు, తమ కుమార్తెకు తెలియదని వాపోయారు. అవి నకిలీ చిత్రాలు అయ్యుంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. దీంతో రెండు కుటుంబాల్లో ఎవరి వాదన నిజమనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు..

ఎవరి వాదన ఎలా ఉన్నా.. దివ్యను హత్య చేయడం నిజంగా ఉన్మాధమే.. నిందితుడు ఇటీవల తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. తేజస్విని దళితురాలు కావటంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 449, 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ల ఆధారంగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రేమోన్మాది నాగేంద్ర పరిస్థితి విషమంగానే ఉంది. అతడికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామంటున్నారు వైద్యులు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వాంగ్మూలం నమోదు కోసం మహిళా జడ్జి ఒకరు సాయంత్రం జీజీహెచ్‌కు వచ్చి ప్రశ్నించారు. బాధితుడి నుంచి సరైన సమాధానాలు రాలేదని తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story