AP: అచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్‌ విగ్రహం తొలగింపు

AP: అచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్‌ విగ్రహం తొలగింపు
జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వీసీ రాజశేఖర్‌... కొత్త ప్రభుత్వం రావడంతో విగ్రహం తొలగింపు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాన్ని సిబ్బంది తొలగించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీసీ రాజశేఖర్‌ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనేక మంది నుంచి విమర్శలు వ్యతిరేకత వచ్చినా.... వైసీపీ అండతో వీసీ రాజశేఖర్‌ వాటిని పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే కూటమి అధికారంలోకి రావటంతో వీసీ నిర్ణయాలు, వైఎస్‌ విగ్రహ ఏర్పాటుపై ఉద్యోగులు తిరుగు బాటు చేశారు. వైఎస్‌ విగ్రహాన్ని తొలగించాలంటూ ఆందోళనకు దిగారు. పాలకుల మెప్పు కోసం వర్సిటీలో రాజకీయ సమావేశాలు, చర్చలు నిర్వహించిన వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించాలని లేనిపక్షంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. వారి పోరాటంతో వెనక్కు తగ్గిన వీసీ వైఎస్‌ విగ్రహాన్ని తొలగించారు. అయితే కొత్త ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకే వీసీ విగ్రహాన్ని తొలగించారని ఉద్యోగులు, అధ్యాపకులు చెబుతన్నారు. గత ఐదేళ్లుగా విశ్వవిద్యాలయంలో వీసీ రాజశేఖర్ పలు ఆర్థిక అవకతవలకు పాల్పడ్డారని ఉద్యోగులు చెప్పారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే ఆయనపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు చంద్రబాబు ప్రమాణస్వీకరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో రానున్న కూటమి అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు, కేంద్ర నాయకత్వం రానుండటంతో ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. భారీ షెడ్లు నిర్మించి వచ్చినవారికి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. అంతేకాకుండా V.I.P. భద్రత సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నలుగురు I.A.S. అధికారులతో కూడిన కమిటి చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లను ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అభిమానులు కార్యకర్తలు కూర్చునేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 150 పాసులు ఇచ్చే అవకాశం ఉండటంతో... 175 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తారనే ఉద్దేశంతో... సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. 70 వేల నుంచి లక్ష మంది అభిమానులు రావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అతిథులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తెలుగుదేశం నేతలు దగ్గరుండి పనులు చేపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story