YS Sharmila: కాంగ్రెస్ లో చేరిన షర్మిల..

YS Sharmila: కాంగ్రెస్ లో చేరిన షర్మిల..
షర్మిలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వైఎస్ షర్మిల దంపతులు సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్సార్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరిక్షణం వరకూ పార్టీకి సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన కూతురుగా ఈ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు.

ఇటీవల మణిపూర్ లో జరిగిన అల్లర్లు, ప్రాణనష్టం తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తను కాంగ్రెస్ లో చేరానని, తన పార్టీ వైఎస్సార్ టీపీని విలీనం చేశానని వివరించారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్సార్ కల అని, ఆ కలను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు.

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో కీలక పరిణామమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీలో మరో మూడునాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోచేరి ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడుతుండటం సంచలనంగా మారింది. అయితే, షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఏ పదవి అప్పగిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశంపై ఏపీ రాజకీయాల్లో జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు రాహుల్ గాంధీ ఇప్పటికే ఓకే చెప్పారని, కాంగ్రెస్ అధిష్టానం ఆమేరకు త్వరలో ప్రకటన చేస్తుందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story