SHARMILA: కొంగు పట్టి అడుగుతున్నా ఆశీర్వదించండి

సౌమ్యుడైన వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపేసిన కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో, ప్రజల కోసం పోరాడిన రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కావాలో కడప ప్రజలు నిర్ణయించుకోవాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో పలుచోట్ల ప్రచారం నిర్వహించిన ఆమె... వివేకా హంతకులకు అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. పులివెందుల సభలో ఉద్వేగానికి గురైన షర్మిల కొంగుచాచి తనను గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పలు మండలాల్లో న్యాయ యాత్ర నిర్వహించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి ప్రచారంలో పాల్గొన్న షర్మిల తొలుత వేంపల్లెలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం లింగాల మండల కేంద్రంలో షర్మిల, సునీత రోడ్ షో నిర్వహించగా వైకాపాకు చెందిన కొందరు కార్యకర్తలు జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.
అనంతరం తమ సొంతూరు పులివెందుల పూల అంగళ్లు సెంటర్‌లో న్యాయ్ యాత్ర నిర్వహించిన ఆమె సౌమ్యుడైన వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి వారికి అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు ఈ ఎన్నికల్లో కడప ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పులివెందుల సభలో మాట్లాడిన సునీత వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. వివేకా హంతకులకు శిక్ష పడేవరకు తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. పులివెందులలో షర్మిల సభ జరుగుతుండగా... కొన్ని వీధి దీపాలు వెలగకపోవడం వెనక అధికార వైసీపీ కుట్ర ఉందని షర్మిల ఆరోపించారు.
వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న. రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలా. సొంత రక్త సంబంధానికి న్యాయం చేయకపోతే మనం ఎందుకు? జనాలు జగన్‌ను నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా? పులివెందుల పులి కాదు.. పిల్లి. 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాలుగున్నరేళ్లుగా కోటల నిద్రపోయాడు. ఇప్పుడు కుంభకర్ణుడి లెక్క నిద్రలేచి డీఎస్సీ అంటూ హడావుడి చేస్తున్నారు. ఐదేళ్లలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. 5ఏళ్లు హంతకులను కాపాడారు. మళ్లీ వారికే సీటు ఇచ్చారు. నేను వైఎస్‌ఆర్ బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. వైఎస్‌ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదు. హంతకుడు చట్టసభల్లోకి వెళ్లొద్దనే కడప నుంచి పోటీ చేస్తున్నా..’’ అని వివరించారు.
‘వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డే అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే.. జగన్ తన అధికారం అడ్డుపెట్టి హంతకులను కాపాడుతున్నారు. సాక్షాత్తూ వైఎస్ తమ్ముడు హత్యకు గురైనా న్యాయం జరగట్లేదు. హత్య చేసిన వాళ్లు, చేయించిన వాళ్లకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ నిర్ధరించింది. గూగుల్ టేక్‌అవుట్ ద్వారా సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఇన్ని సాక్ష్యాలున్నా సీబీఐ.. అవినాష్‌రెడ్డిని టచ్ చేయలేకపోయింది. ప్రజలు జగన్‌కు అధికారం ఇచ్చింది నిందితులను కాపాడేందుకేనా? జగన్ సీఎం అయ్యాక అందరికంటే ఎక్కువ నష్టపోయింది సునీతే. పులి వెందుల పులి అన్నారు. ప్రధాని మోదీ ముందు జగన్ పిల్లిలా మారారు. ప్రత్యేక హోదా కోసం ఆనాడు రాజీనామా డ్రామాలు, దీక్షలు చేశారు. సీఎం అయిన తర్వాత భాజపాతో దోస్తీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారు. జలయజ్ఞం వైఎస్‌ఆర్ కల. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు.. చేశారా? పులివెందుల బిడ్డ సీఎంగా ఉండి రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా కట్ట లేదంటే అవమానం కాదా? అని షర్మిల ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com