YS Sunitha : వివేకా హత్య కేసుపై సుప్రీంను ఆశ్రయించిన వైఎస్ సునీత..

YS Sunitha : వివేకా హత్య కేసుపై సుప్రీంను ఆశ్రయించిన వైఎస్ సునీత..
YS Sunitha : మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన కుమార్తె సునీత.

YS Sunitha : మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన కుమార్తె సునీత. కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఏపీ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా...కేసు విచారణ ముందుకు సాగేలా కనిపించడం లేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై నిందితులుగా ఉన్న వారు కేసులు పెడుతున్నారని తెలిపారు. ఏపీలో కేసు దర్యాప్తు ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నాయని కంప్లైంట్ చేశారు. అవసరమైతే కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, సీబీఐ, ఏపీ డీజీపీలను చేర్చారు.

2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలోని సొంత నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు.మూడేళ్లు గడిచినప్పటికీ అసలు హంతకులు ఎవరనేది ఇంత వరకు నిర్ధారణ కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సునీత..సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. వివేకా హత్య జరిగిన వెంటనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హత్యకేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను నియమించింది. ఏడాది వ్యవధిలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటైనా హంతకులను పట్టుకోలేకపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తన తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ సునీత రెండేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసి...తరువాత ఉపసంహరించుకున్నారు.

సునీత పిటిషన్‌ను విచారించిన హైకోర్టు 2020 మార్చి 11న సీబీఐకి కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జులై 18న కడపలో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు 246 మంది సాక్షులను విచారించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులపై ఛార్జిషీట్‌ దాఖలు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఏ1గా ఎర్ర గంగిరెడ్డి, ఏ2గా సునీల్‌యాదవ్‌, ఏ3గా ఉమాశంకర్‌రెడ్డి, ఏ4గా దస్తగిరి, ఏ5గా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్లను ఛార్జిషీట్‌లో సీబీఐ నమోదు చేసింది.

వీరిలో సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం కడప జైల్లో రిమాండు ఖైదులుగా ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి బెయిల్‌పై ఉన్నారు. 5 నెలలుగా సీబీఐ విచారణ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాదాపు 500 పేజీలతో కూడిన పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. కేసు విచారణ అంతా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని, సీబీఐ దర్యాప్తునకు ఏపీ పోలీసుల సహకారం లేకుండా చూడడంతో పాటు... కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరాన్ని సమగ్రంగా పేర్కొన్నారు.

కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ పైనే కడపలో పోలీసులు కేసు నమోదు చేయడంవంటి అంశాలను పిటిషన్‌లో వివరించారు. కడప కోర్టులో విచారణ జరిగితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో పాటు..రాజకీయంగా పలు అంశాలు కేసుతో ముడిపడి ఉన్నాయని సునీత పేర్కొన్నారు. కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కూడా ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story