Viveka Murder Case: రహస్య సాక్షిని తెరపైకి తీసుకొచ్చిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో మలుపు తిరిగింది. రాజకీయ కుట్ర కోణంలో రహస్య సాక్షిని సీబీఐ తెరపైకి తీసుకువచ్చింది. అవినాష్‌కి కడప ఎంపీ సీటు ఇవ్వడం వివేకానందరెడ్డికి ఇష్టం లేదని,జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారని రహస్య సాక్షి తన వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. గత ఏప్రిల్ 26న నమోదు చేసిన ఈ స్టెట్‌మెంట్ ను తరువాతి అభియోగపత్రంలో దాఖలు చేస్తామని, సాక్షిగా పరిగణనలోకి తీసుకుంటామని సీబీఐ తెలిపింది. అయితే కేసు తీవ్రత దృష్ట్యా ఆ సాక్షి పేరును, స్టేట్‌మెంట్‌ను బయటపెట్టలేమని తెలిపింది. సాక్షి పేరు బయటపెడితే సాక్షి ప్రాణ హాని ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున ప్రస్తుతం కోర్టు పరిశీలనకు మాత్రమే సమర్పిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.
గతంలో వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి ఆత్మహత్య, తొలుత వాంగ్మూలం ఇచ్చిన సీఐ శంకరయ్య తర్వాత నిరాకరించడం వంటి పలు ఘటనల నేపధ్యంలో సాక్షి పేరు బయట పెట్టలేక పోతున్నామని తెలిపింది సీబీఐ. వాంగ్మూలాన్ని కోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అయితే పిటిషనర్‌కు ఇవ్వకుండా, వారి వాదన వినకుండా సీబీఐ సమర్పించిన వాంగ్మూలాన్ని పరిశీలించి దాని ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు, సాధారణ న్యాయ ప్రక్రియకు విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించారు. ఇలా పిటిషనర్‌కు వివరాలు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పులు ఏమైనా ఉంటే సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
వివేకా హత్య కుట్రను అమలు చేయడానికి డబ్బు సమకూర్చింది అవినాష్‌రెడ్డేనని సీబీఐ తెలిపింది. అవినాష్ శివశంకరరెడ్డికి ఇవ్వగా, ఆయన గంగిరెడ్డికి ఇచ్చారని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పారన్నారు. గంగిరెడ్డి సెంట్రిక్‌గా 40 కోట్లకు కుట్ర ఒప్పందం కుదిరిందన్నారు. హత్యకు ముందు శివశంకరరెడ్డితో అవినాష్‌రెడ్డి చాటింగ్ చేశారని, అర్ధరాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 5.20 గంటల మధ్య అవినాష్‌రెడ్డి వాట్సప్ కాల్ చేశారన్నారు. అవినాష్‌రెడ్డి వాట్సప్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు ఐపీడీఆర్ ద్వారా తేలిందని సీబీఐ తన వాదనలు వినిపించింది. అయితే ఎవరితో మాట్లారన్నది గుర్తించడానికి సాధ్యం కాదన్నారు. అది తెలుసుకోవాలంటే అవినాష్‌రెడ్డిని కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని కోరారు.
ఇక వివేకా హత్యకు రాజకీయ శత్రుత్వమే కారణమని సీబీఐ తెలిపింది. కడప రాజకీయాల్లో వివేకా చురుగ్గా ఉండటంతో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డిలు ఆయనకు వ్యతిరేకంగా కుట్ర మొదలుపెట్టారన్నారు. ఎమ్మెల్సీ టికెట్‌ను అవినాష్‌రెడ్డి తన అనుచరుడైన శివశంకరరెడ్డికి ఇప్పించాలని ప్రయత్నించారని, కడప ఎంపీ టిక్కెట్ అవినాష్‌రెడ్డికి దక్కకుండా విజయమ్మ, షర్మిలకు ఇవ్వాలన్న వివేకా వాదన వీరికి నచ్చక కుట్రకు తెర తీశారన్నారు. హత్యకు నెల రోజుల ముందే కుట్ర ప్రారంభమైందన్నారు. పరిస్థితులను చూస్తే నేరచరిత్ర ఉన్న శివశంకరరెడ్డి ద్వారా వివేకా హత్యకు పథక రచన చేసినట్లుందన్నారు. శివశంకరరెడ్డికి సన్నిహితుడైన గంగిరెడ్డిని కుట్రలో భాగస్వామిని చేసి హత్య చేయించారని సీబీఐ ధర్మాసనం ముందు వాదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com