YS Vivekananda Reddy: తొలుత గుండెపోటు.. తర్వాత గొడ్డలిపోటు.. వివేకా మర్డర్ మిస్టరీకి మూడేళ్లు..

YS Vivekananda Reddy: తొలుత గుండెపోటు.. తర్వాత గొడ్డలిపోటు.. వివేకా మర్డర్ మిస్టరీకి మూడేళ్లు..
YS Vivekananda Reddy: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి మూడేళ్లైంది.

YS Vivekananda Reddy: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి మూడేళ్లైంది. 2019 మార్చి 15న పులివెందులలోని ఆయన నివాసంలోనే గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చారు. ఉదయం 6.40 గంటలకు వివేకా మృతి చెందాడని పోలీసులకు ఫోన్ చేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి. హత్యకు గురయ్యారనే విషయాన్ని పేర్కొనని అవినాష్‌రెడ్డి

ఒంటి నిండా గాయాలతో.. రక్తం మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహం. ఇది చూసిన ఎవరికైనా కిరాతక హత్యే స్పష్టమవుతుంది. అయినా రక్తాన్ని తుడిచే ప్రయత్నం చేసిందెవరు..? దాని వెనుక ఉన్నది ఎవరు..? ఉదయం 7.30 గంటలకు వివేకా నివాసానికి చేరుకున్న సీఐ శంకర్‌రెడ్డి. ఉదయం 8 గంటలకు అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్‌గా నమోదు.

ఉదయం 9.19 నిమిషాలకు వైసీపీ అనుకూల సాక్షి టీవీలో వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా బ్రేకింగ్ న్యూస్. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివేకా గుండెపోటుతోనే మరణించినట్లుగా నేతల ప్రకటనలు. ఎన్నికలకు నెలల ముందు దారుణంగా, అతి కిరాతకంగా జరిగిన వివేకా మర్డర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది.

తొలుత గుండెపోటు అని ప్రచారం చేసినా తర్వాత గొడ్డలిపోటు అని తేలింది. అయితే సీబీఐ రంగంలోకి దిగాక గానీ కేసులో పురోగతి కనిపించలేదు. ఒకప్పుడు సీబీఐ విచారణ కోరిన వాళ్లే.. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ అక్కర్లేదంటూ కోర్టుకు వెళ్లడంతో ఇన్నేళ్లుగా కేసు సాగుతూ వచ్చింది. జగన్ ప్రభుత్వం నియమించిన సిట్‌ సరిగా పనిచేయడం లేదని, సీబీఐ దర్యాప్తు కావాలని వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో.. ఈ కేసు దర్యాప్తులో వేగం పుంజుకుంది.

ఈ హత్యకేసులో నలుగురు పాత్రధారులను గుర్తించింది సీబీఐ. మరి హత్య వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తోంది. వివేకా హత్య కేసులో ప్రముఖంగా వినిపించిన పేరు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి. అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై పలువురు సాక్షులు అనుమానాలు వ్యక్తం చేశారు.

జగన్‌ బాబాయి వివేకానందరెడ్డిని పులివెందులలోని ఆయన నివాసంలోనే గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చారు. ఓవైపు రక్తపు మడుగులో ఉన్నప్పటికీ.. గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేశారు. ఆధారాలను చెరిపేసి, ఒంటిపై గాయాలకు కుట్లు వేసి, అయినవాళ్లు, బంధువులు రాకముందే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

వివేకానంద రెడ్డిని ఆస్థితిలో చూసిన వాళ్లు.. ఇది హత్యేనని అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం తరువాత హత్య కేసుగా మార్చారు. ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని ఆరోపణలు గుప్పించారు. దీంతో వివేకా హత్య కేసును తేల్చడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వం.

ఎస్పీ అభిషేక్ మహంతి సారథ్యంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సాక్ష్యాధారాలు మాయం చేశారన్న అభియోగాలతో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను.. 2019 మార్చి 28న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంతలో జగన్‌ సర్కార్‌ రావడం, వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు తావిచ్చింది.

ఆ తర్వాత కడప ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో మూడో సిట్ ఏర్పాటైంది. ఈ మూడు సిట్‌లు.. 1300 మంది సాక్షులు, అనుమానితులను విచారించింది. కేసు సాగుతూ వెళ్లడమే తప్ప ఎలాంటి పురోగతి లేకపోవడంతో.. వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వివేకా కేసును సీబీఐకి అప్పగిస్తూ 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సీబీఐ ఎంటర్‌ అయినప్పటి నుంచి కేసు విచారణ వేగంగా సాగింది. కడప, పులివెందులలోని దాదాపు 250 మంది సాక్షులు, అనుమానితులను సీబీఐ ప్రశ్నించింది. ముఖ్యంగా సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, రంగన్నను ఎక్కువగా ప్రశ్నించారు అధికారులు. 2021 ఆగస్టు 2న వివేకా హత్యకేసులో మొదటి అరెస్ట్‌ జరిగింది.

సునీల్‌ యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సెప్టెంబరు 9న ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారంటూ.. 2021 అక్టోబర్‌ 26న పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దస్తగిరి వాంగ్మూలంతో కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఐదో నిందితుడిగా చేర్చిన సీబీఐ... నవంబర్ 17న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది.

వివేకాను హత్యలో కుటుంబ సభ్యులు, అయినవాళ్లే ఉండడంతో ఈ కేసుపై ఉత్కంఠ నెలకొంది. కడప ఎంపీ టికెట్‌ వివాదం కూడా హత్యకు కారణమై ఉండొచ్చని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. దీంతో ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు జగన్‌ ప్రమేయం కూడా ఉందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మరి.. వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న వేళ.. ఎలాంటి సంచనాలు బయటకొస్తాయో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story