జగన్‌కు ఓటేసినందుకు క్షమించాలి..లోకేష్ వద్ద వాపోయిన వైసీపీ కార్యకర్త

జగన్‌కు ఓటేసినందుకు క్షమించాలంటూ ఓ వైసీపీ కార్యకర్త.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వద్ద వాపోయాడు. యువగళం పాదయాత్రలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో రెడ్డి సంఘం నాయకులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అయితే.. ఆ సమావేశంలో యాడికి మండల వైసీపీ కార్యకర్త సుదర్శన్‌రెడ్డి ప్రత్యక్షమయ్యాడు. లోకేష్ వద్ద తన సమస్యలు చెప్పుకుని వాపోయాడు. తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నమ్ముకుని నిండా మోసపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఎన్నికల్లో తన సొంత డబ్బు ఖర్చు పెట్టి పనిచేసినా తగిన గుర్తింపు ఇవ్వలేదని.. అసలు పట్టించుకోలేదంటూ వాపోయాడు. ఈ విషయంలో సీఎంను కలవాలని పాదయాత్ర చేసినా ఉపయోగం లేకుండా పోయిందన్నాడు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తి ఏదో చేస్తారన్న నమ్మకంతో రెడ్లు అంతా ఓటేశారని.. తీరా చూస్తే ఏమీ లేదని వాపోయాడు. రెడ్లు చేసిన తప్పునకు మీరు మమ్మల్ని క్షమించాలంటూ సుదర్శన్‌రెడ్డి.. లోకేష్‌ను వేడుకున్నాడు. నిరుపేద రెడ్లను టీడీపీ అధికారంలోకి రాగానే ఆదుకోవాలని కోరాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com