Andhra Pradesh : గిగ్ వర్కర్ల గోడును పట్టించుకోని జగన్

సంక్షేమం అంటూ నిరంతర భజన చేసే వైకాపా ప్రభుత్వం.. యువతకు ఉపాధి చూపలేకపోయింది. పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తూ.. వారికి తీరని ద్రోహం చేసింది. దీంతో యువత.. తమ ఆర్థిక కష్టాల్ని అధిగమించడానికి డెలివరీ బాయ్, బైక్ రైడర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో.. తదితర సంస్థల్లో గిగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ రంగంపై ఆధారపడే వారి సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్నా.. వారి సంక్షేమానికి ఎలాంటి చర్యల్లేవు. సెలవులు, ఈపీఎఫ్ వంటి సామాజిక భద్రత అందడం లేదు. వారికి జరగరానిది జరిగితే.. కుటుంబాల జీవనం ప్రశ్నార్థకమవుతోంది.
విద్యార్థులు, యువతే కాకుండా.. మధ్య వయస్కులూ ఆదాయం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ రంగంపైన ఆధారపడుతున్నవారి సంఖ్య పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్, తెలంగాణ ప్రభుత్వాలు వారికి సంక్షేమ పథకాలు ప్రకటించాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పనిచేస్తున్న 4.2 లక్షల మంది గిగ్ వర్కర్లకు 5లక్షల రూపాయల మేర జీవిత బీమాతోపాటు 10లక్షల రూపాయల ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో పనిచేసే వారు లక్ష మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో మహిళలూ ఉన్నారు. అయినా జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా వీరి సంక్షేమం గురించి ఆలోచించలేదు.
రాష్ట్రంలో యువతకు విద్యార్హతలు ఉన్నా.. సరైన ఉద్యోగాలు లభించడం లేదు. ఐదేళ్లుగా కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉన్న పరిశ్రమల్లో కొన్ని రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఐటీ కంపెనీల ఊసే లేదు. యువతకు నైపుణ్య శిక్షణ కూడా అందని దుస్థితి. దీంతో అధికశాతం యువత ఉపాధి కోసం రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. అలా వెళ్లడం ఇష్టంలేక రాష్ట్రంలోనే మెరుగైన ఉపాధి కోసం చూసేవారు... తాత్కాలికంగా గిగ్ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. మరికొందరు కొన్ని కోర్సుల్లో శిక్షణకు అవసరమయ్యే సొమ్ము కోసం.. గిగ్ కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు.
నచ్చిన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు ఉండటమే గిగ్ ఉద్యోగాల ప్రత్యేకత. కానీ వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కష్టపడితేగానీ 500నుంచి 800 వరకు రాదు. కొన్నిసార్లు రాత్రి సమయాల్లో విధులు, పోలీసుల నుంచి సమస్యలు తదితర ఇక్కట్లూ ఉన్నాయి. ఒకప్పుడు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలకే పరిమితమైన వీరి సేవలు ఇప్పుడు గ్రామాలకూ విస్తరిస్తున్నాయి. విజయవాడలో కళాశాలల్లో చదివే వందలాది మంది విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లభించక.. కొందరు పట్టణాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు అందించి తిరిగి వెళ్తున్నారు. ఎండలు, వానల్లోనూ గిగ్ కార్మికులు కాలంతో పోటీపడుతూ ఆర్డర్లను తీసుకెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com